కొసరుకు మురిసి… అసలువి మరిచి..

- అస‌లు హ‌క్కులు ప‌ట్టించుకోని కార్మిక సంఘాల నేత‌లు
- ఒప్పందం చేసుకున్న‌వి కూడా తాత్కాలిక ప్రాతిప‌దిక‌నే
- కార్మిక సంఘాల నేత‌ల తీరుపై కార్మికుల్లో ఆందోళ‌న‌

మంచిర్యాల : సింగరేణిలో కార్మిక సంఘ నేతలు హ‌క్కుల సాధ‌న విష‌యంలో అసలు విషయాలు మరిచిపోయి… చిన్న చిన్న వాటికే ఆనందం వ్యక్తం చే్స్తున్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణలో తమ ప్రాణాలు సైతం లెక్క చేయని నేతలు ఒక‌ప్పుడు తెగించి పోరాడితే ఇప్పుడు దక్కిందే దిక్కన్నట్లు నేత‌లు వ్యహరించడం పట్ల కార్మికుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.

కార్మికుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంతో సహా జాతీయ కార్మిక సంఘాలు సైతం సింగరేణిలో సమ్మెకు దిగాయి. రెండు విడతలుగా సమ్మె చేశారు. అన్ని సంఘాలు సమ్మెకు దిగడంతో ఆర్ఎల్సీ సమక్షంలో చర్చలు కూడా కొనసాగాయి. రెండు, మూడు విడతలుగా ఈ చర్చలు జరగ్గా తాజాగా బుధవారం చర్చలు సఫలం అయినట్లు కార్మిక సంఘ నేతలు ఉత్సాహంగా ప్రకటించారు. 11 డిమాండ్లలో 9 సాధించామని అన్ని కార్మిక సంఘాల నేతలు విడివిడిగా సోషల్ మీడియాలో హోరెత్తించారు. అది తమ ఘనతేనని గొప్పలు చెప్పుకున్నారు.

అయితే, ఈ డిమాండ్ల సాధన విషయంలో కార్మిక సంఘాల నేతలు సరిగ్గా వ్యవహరించలేదని పలువురు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూతూ మంత్రంగా అగ్రిమెంట్ జరిగిందని వారు చెబుతున్నారు. అసలు డిమాండ్లు రెండింటిని వదిలేసి మిగతా వాటిని అగ్రిమెంట్ చేసుకున్నారని కార్మిక సంఘాలపై కార్మికులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక చేసుకున్న అగ్రిమెంట్ కూడా సరిగ్గా చేసుకోలేదని చెబుతున్నారు. ఇవన్నీ నేతలకు తెలిసినా మిగతా వాళ్లకు తామెక్కడ తీసిపోతామోనని ప్రచార్భాటం తప్ప అసలైన వాటిని పట్టించుకోలేదని పలువురు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కార్మికులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నది సొంతింటి కల. దానిపైన కార్మిక సంఘ నేతలు కనీసం పట్టించుకోలేదు. ఇదే ప్రధానమైనది కాగా, దీని గురించి ఏ మాత్రం ఆలోచించలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పెర్స్కుపై ఆదాయపు పన్ను విషయంలో సైతం కార్మిక సంఘాలు పట్టించుకోలేదు. దేశంలోని బొగ్గు సంస్థలు అన్నింటిలో ఈ పెర్స్కుపై ఆదాయపు పన్ను ఆయా సంస్థలు చెల్లిస్తాయి. ఇక సింగరేణిలో అధికారులకు సైతం ఈ సౌకర్యం ఉంది. కానీ కేవలం కార్మికులకు మాత్రం పెద్ద ఎత్తున ఆదాయపు పన్ను విధిస్తున్నారు. క్వార్టర్లు ఉన్న వారికి విద్యుత్ పేరిట, నీళ్ల పేరిట ఇలా అన్ని రకాలుగా పెర్స్కుపై ఆదాయపు పన్ను వేస్తున్నారు. దీనిపై ఏ నిర్ణయం తీసుకోలేదు.

ఇక చాలా నిర్ణయాలు కూడా వన్టైం సెటిల్మెంట్ కింద ఉన్నవే. కార్మికులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగేలా లేవన్న అభిప్రయాలు కూడా ఉన్నాయి. మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన సింగరేణి ఉద్యోగి జీవిత భాగస్వామి ఒకవేళ ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో, సింగరేణి పాఠశాలల్లో ఉద్యోగం చేస్తున్నా వారి వారసులకు ఉద్యోగం ఇవ్వడానికి ఒక్క అవకాశం కొరకు అంగీకరించింది. ప్రస్తుతం అలాంటి వారి దరఖాస్తులను పెండింగ్‌ లో ఉంచారు. ఈ ఒప్పందం ప్రకారం వన్ టైం సెటిల్మెంట్ గా వారసత్వ ఉద్యోగం ఇవ్వడానికి యాజమాన్యం పేర్కొంది. మ‌రి ఆ త‌ర్వాత ఎవ‌రైనా వ‌స్తే వారి ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది కార్మిక సంఘం నేత‌ల‌కే తెలియాలి.

ప్రమాదంలో చనిపోయిన సింగ‌రేణి కార్మికుల‌కు కోటి రూపాయ‌ల ఎక్స్ గ్రేషియా వ‌చ్చేలా చేస్తామ‌ని అన్ని కార్మిక సంఘాలు హామీ ఇచ్చాయి. దానిపైనే పోరాటం చేస్తామ‌ని కార్మికుల ముందు నేత‌లు ప్ర‌తిజ్ఞ‌త‌లు సైతం చేశారు. కానీ, అస‌లు విష‌యానికి వ‌చ్చే స‌రికి డీలా ప‌డిపోయారు. బ్యాంకు ద్వారా గని ప్రమాదాలు, ఇతర ప్రమాదాల్లో మృతి చెందిన పక్షంలో వారి కుటుంబీకులకు రూ.40 లక్షల పరిహారం ఇచ్చేలా ఎస్.బి.ఐ.తో అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు యాజమాన్యం తెలిపింది. ఇతర బ్యాంకులు ఈ పరిహారం మొత్తాన్ని పెంచేందుకు ముందుకు వచ్చే అవకాశాలను అన్వేషిస్తామని హామీ ఇచ్చింది. దీనికే కార్మిక సంఘం నేత‌లు ఆహా.. ఓహో అంటూ చ‌ర్చ‌లు సూప‌ర్ అంటూ జ‌బ్బ‌లు చ‌రుచుకున్నారు.

ఇప్ప‌టికైనా కార్మిక సంఘ నేత‌లు మిగిలిన స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి చొర‌వ చూపాల‌ని, ఉన్న వాటిని సంపూర్ణంగా సాధించాల‌ని ప‌లువురు కోరుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like