కొత్త‌ర‌కం కోడిగుడ్లు..

అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్నసైజు గుడ్లు - ఒక్క బుక్కకు చాలవంటున్న తల్లిదండ్రులు - చిన్న గుడ్లు తిర‌స్క‌రిస్తే బెదిరిస్తున్న కంట్రాక్ట‌ర్‌ -   పెద్ద గుడ్లు బ‌హిరంగ మార్కెట్‌కు - మ‌ళ్లీ బ‌హిరంగ మార్కెట్‌కు చెన్నూరు గుడ్లు - సాక్షాత్తు మంత్రి మాట ప‌ట్టించుకోని అధికారులు

మంచిర్యాల – పైన ఉన్న వాటిని చూశారా..? ఏంటి అంత చిన్న‌గా ఉన్న‌య్‌.. పిట్ల గుడ్లు అనుకుంటున్నారా..? కాదండి అవి కోడిగుడ్లే.. కాక‌పోతే అంగ‌న్వాడీ కేంద్రాల‌కు స‌ర‌ఫ‌రా చేస్తున్న కోడిగుడ్లు. అంగ‌న్వాడీ కేంద్రాల‌కు స‌ర‌ఫ‌రా అవుతున్న గుడ్లు పిట్ట గుడ్ల‌లాగా చిన్న‌గా ఉంటున్నాయి. టీచ‌ర్లు వాటిని వద్దంటే కంట్రాక్ట‌ర్ వారినే బెదిరింపుల‌కు గురి చేస్తున్నాడు. దీంతో అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు వాటినే ల‌బ్ధిదారుల‌కు అందిస్తున‌నారు.

మంచిర్యాల జిల్లాలో కోడిగుడ్ల పంపిణీలో భారీగా అవ‌క‌త‌క‌లు చోటు చేసుకుంటున్నాయి. అందులో ఒక‌టి కంట్రాక్ట‌ర్ చేతి వాటం కాగా, అధికారులు సైతం అమ్యామ్యాలు తీసుకుని త‌మ వంతు సాయ‌మందిస్తున్నారు. దీంతో కంట్రాక్ట‌ర్ ఆడింది ఆట‌.. పాడింది పాట‌గా మారింది. జిల్లా వ్యాప్తంగా ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. అంగన్వాడీలకు సరఫరా చేసే గుడ్లు 50 గ్రాముల కంటే తక్కువ ఉండొద్దని నిబంధన పెట్టామని, చిన్న గుడ్లను సరఫరా చేస్తే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ చేసి, అధికారులను బాధ్యులు చేస్తామని గ‌తంలో ఇక్క‌డ‌కు వ‌చ్చిన రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ చిన్న గుడ్లు కేంద్రాలకు పంపించకుండా కచ్చితంగా 50 గ్రాములకు తగ్గకుండా ఇవ్వాలని ఆదేశించారు. చిన్న గుడ్లు వస్తే వెంటనే ఆ కాంట్రాక్టర్స్ ను బ్లాక్ లిస్ట్ చేయాల‌ని చెప్పారు. సీడిపిఓ లను బాధ్యులం చేస్తామ‌ని, దీనిని కలెక్టర్ , అదనపు కలెక్టర్ కు ప‌ర్య‌వేక్షించాల‌ని కోరారు. గుడ్ల కోసం కాంట్రాక్టర్స్ కు మార్కెట్ ధర చెల్లిస్తూ వారికి అన్ని సదుపాయాలు ఇస్తున్నామ‌ని, కాబట్టి చిన్న పిల్లలకి ఇచ్చే గుడ్ల విషయంలో రాజీ పడేది లేదని స్ప‌ష్టం చేశారు. కానీ ఇక్క‌డ అందుకు విరుద్ధంగా జ‌రుగుతోంది.

పిట్ట‌గుడ్ల మాదిరిగానే..
అంగ‌న్‌వాడీ కేంద్రాల్లో కంట్రాక్ట‌ర్ స‌ర‌ఫ‌రా చేస్తున్న గుడ్లు ఒక్క బుక్కతో నమలకుండానే మింగే సైజులో ఉంటున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిట్టగుడ్డు మాదిరిగా చిన్నగా ఉన్న కోడిగుడ్లు ఇస్తున్నారు. వాస్త‌వానికి 50 గ్రాముల‌కు త‌గ్గ‌కుండా ఉండాలి. కానీ అవి కేవ‌లం 25 గ్రాముల నుంచి 30 గ్రాముల వ‌రకే ఉంటున్నాయి. భోజనంతోపాటు చిన్న పిల్లలకు, గర్భిణులు, బాలింతలకు ఒక కోడిగుడ్డును అందిస్తున్నారు. జిల్లాలో ఉన్న అంగ‌న్‌వాడీ కేంద్రాల‌కు కంట్రాక్ట‌ర్ గుడ్లు స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. అయితే ఎక్క‌డా కూడా స‌రైన విధంగా గుడ్లు స‌ర‌ఫ‌రా కావ‌డం లేదు. చిన్న గుడ్ల‌నే అందిస్తున్నారు. అయినా ఈ విష‌యంలో అటు సూప‌ర్‌వైజ‌ర్లు, సీడీపీవోలు, అధికారులు క‌నీసం నోరు మెద‌ప‌డం లేదు.

అంగ‌న్‌వాడీ టీచ‌ర్ల‌నే బెదిరిస్తున్నారు..
కొన్ని సంద‌ర్భాల్లో అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు చిన్న గుడ్లు త‌మ‌కు వద్దని తిర‌స్క‌రిస్తే వారినే బెదిరింపుల‌కు గురి చేస్తున్న విష‌యం నాంది దృష్టికి వ‌చ్చింది. కంట్రాక్ట‌ర్లు బెదిరిస్తున్నార‌ని కోడిగుడ్ల కంట్రాక్ట‌ర్ ఒక మంత్రిద‌ని త‌మ‌కేమీ భ‌యం లేద‌ని ద‌బాయిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ద్వారా ఫోన్లు చేయిస్తామ‌ని చెబుతుండ‌టంతో అంగ‌న్వాడీ టీచ‌ర్లు చేసేదేమీ లేక సైలెంట్‌గా ఉంటున్నారు. మ‌రోవైపు దీనిని స‌మీక్షించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూప‌ర్‌వైజర్లు, సీడీపీవోలకు ప్ర‌తి నెలా కంట్రాక్ట‌ర్ల వ‌ద్ద డ‌బ్బులు తీసుకుని చూసీచూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. టీచ‌ర్లు ఎవ‌రైనా కోడిగుడ్ల గురించి ఫిర్యాదు చేసే వారినే టార్గెట్ చేసుకుంటున్నార‌ని అందుకే అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు వ‌చ్చిన చిన్న కోడిగుడ్ల‌నే స‌ర‌ఫ‌రా చేస్తున్నార‌ని చెబుతున్నారు.

ప్ర‌తి నెలా చేతులు మారుతున్న ల‌క్ష‌ల రూపాయ‌లు..
ఈ కోడిగుడ్ల వ్య‌వహారంలో ప్ర‌తి నెలా ల‌క్ష‌ల రూపాయాలు చేతులు మారుతున్నాయి. ఒక నెల‌కు రెండు విడ‌త‌లు క‌లిపి దాదాపు ఏడు ల‌క్ష‌ల గుడ్ల వ‌ర‌కు వేస్తున్నారు. ఒక్కో గుడ్డుకు రూపాయి వేసుకున్నా దాదాపు ఏడు ల‌క్ష‌ల రూపాయ‌లు అధికారుల‌కు ముడుపులు ముడుతున్నాయి. ఇక పెద్ద గుడ్ల స్థానంలో చిన్న గుడ్లు స‌ర‌ఫ‌రా చేస్తున్నందుకు కంట్రాక్ట‌ర్‌కు ఒక్కో గుడ్డుపై రెండు రూపాయ‌లు మిగులుతున్నాయి. అంటే క‌నీసం ప‌ద్నాలుగు ల‌క్ష‌లు అన్న‌మాట‌. ఈ పెద్ద గుడ్ల‌ను బ‌హిరంగ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారు. రెస్టారెంట్లు, హోట‌ళ్ల‌కు ఈ గుడ్లు స‌ర‌ఫ‌రా అవుతున్నాయి. టీచ‌ర్లు సైతం స‌గం తాము అమ్ముకుని సగం ల‌బ్ధిదారుల‌కు ఇస్తున్నారు.

చెన్నూరు గుడ్లు మ‌ళ్లీ బ‌య‌ట‌కు..
కొద్ది రోజుల కింద‌ట కోట‌ప‌ల్లి మండ‌లం న‌క్క‌ల‌ప‌ల్ల ప్రాంతానికి చెందిన కోడిగుడ్లు బ‌హిరంగ మార్కెట్‌కు త‌ర‌లిస్తుండ‌గా దొరికాయి. ఇందులో అధికారులు, టీచ‌ర్ల హ‌స్తం ఉండ‌గా ఆ కేసును త‌ప్పు దోవ ప‌ట్టించి కేవ‌లం ఆ నెపం డ్రైవ‌ర్ మీద వేసేశారు. ఇందు కోసం దాదాపు ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చు చేసిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం అదే ప్రాంతం నుంచి మ‌ళ్లీ కోడిగుడ్లు బ‌హిరంగ మార్కెట్‌కు త‌ర‌లివెళ్లాయి. ఒక ప్ర‌జాప్ర‌తినిధికి ద‌గ్గ‌ర బంధువు కావ‌డంతో ఆ టీచ‌ర్‌ను కాపాడుతున్న‌ట్లు స‌మాచారం. అంతేకాకుండా అక్క‌డ ఉన్న ఐసీడీఎస్ అధికారి దీనికి సూత్ర‌ధారిగా భావిస్తున్నారు. ఇలా ఎన్నిమార్లు అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగినా అధికారులు క‌నీసం ప‌ట్టించుకోక‌పోవ‌డం ప‌ట్ల తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి.

 

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like