కేటీఆర్ దోస్తు కుల వివాదం

Khanapur: ఆ అభ్య‌ర్థి కులంపై అప్పుడే వివాదాలు రాజుకుంటున్నాయి. ఆయ‌న‌కు టిక్కెట్టు కేటాయిస్తూ అలా ప్ర‌క‌ట‌న వ‌చ్చిందో…? లేదో..? ఇలా వివాదం మొద‌లైంది. ఇంకా టిక్కెట్టు ఇవ్వ‌క‌ముందే అత‌ను ఎస్టీ కాదంటూ లొల్లి షురూ అయ్యింది…? ఇంత‌కీ ఎవ‌రా నేత‌…? ఏంటా ఆరోప‌ణ‌…?

నిర్మ‌ల్ జిల్లా ఖానాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయ‌క్‌ను కాద‌ని, అక్క‌డ కొత్త‌గా జాన్స‌న్ నాయ‌క్ అనే వ్య‌క్తికి బీఆర్ఎస్ టిక్కెట్టు ఇస్తున్న‌ట్లు అధినేత కేసీఆర్ ప్ర‌క‌టించారు. త‌న‌కే టిక్కెట్టు భావించిన ఎమ్మెల్యే రేఖా నాయ‌క్ కు చుక్కెదుర‌య్యింది. చివ‌రి నిమిషం లో టిక్కెట్టు క‌ట్ కావ‌డంతో ఆమె క‌న్నీళ్లు పెట్టుకుని బోరున విల‌పించారు. రాత్రి పగలు అని చూడకుండా ప్రజల్లో ఉన్నాన‌ని, మూడో సారి గెలిస్తే మంత్రి పదవి వస్తుందని ఇలా చేసారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌డిగుడ్డ‌తో గొంతు కోశారంటూ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. తాను ప్ర‌జ‌ల్లోనే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. ఇదంతా ఒక్కెత్తు కాగా, రేఖా నాయ‌క్ టిక్కెట్టు వ‌చ్చిన జాన్స‌న్ నాయ‌క్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

జాన్స‌న్ నాయ‌క్ ఎస్టీనే కాదంటూ బాంబు పేల్చారు. వాళ్ల తాత ముత్తాత‌లు అంతా క్రిస్టియన్లేన‌ని ఆరోపించారు. మెట్పల్లిలో వాళ్ల ఇంట్లో చర్చి ఉందని, జాన్స‌న్ నాయ‌క్ తండ్రి చర్చి ఫాస్టర్ అని స్ప‌ష్టం చేశారు. వాళ్ల తాత‌,ముత్తాత‌లు క్రిస్టియన్లు అయిన‌ప్పుడు జాన్స‌న్ నాయ‌క్ ఎస్టీ ఎలా అవుతాడంటూ ప్ర‌శ్నించారు. ఆయ‌న‌కు ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గం టిక్కెట్ ఎలా కేటాయించార‌ని ఆమె ప్ర‌శ్నించారు. ఆయ‌న కులానికి సంబంధించి అన్ని వివ‌రాలు ఆధారాల‌తో నిరూపిస్తాన‌ని రేఖానాయ‌క్ తెలిపారు. మ‌రో అడుగు ముందుకు వేసి త‌ప్పుడు ధృవీక‌ర‌ణ ప‌త్రం తెచ్చి ఎస్టీ అంటున్నార‌ని ఆరోపించారు.

మ‌రోవైపు ఆయ‌న క‌న్వ‌ర్టెడ్ క్రిస్టియ‌న్ అంటూ గ‌తంలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల వీడియోను ప్ర‌స్తుతం జాన్స‌న్ నాయ‌క్ వ్య‌తిరేక వ‌ర్గం వైర‌ల్ చేస్తోంది. ఇటు రేఖా నాయ‌క్ ఆరోప‌ణ‌ల‌కు బ‌లం చేకూర్చే విధంగా ఆ వీడియో వైర‌ల్ కావ‌డం పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారి తీస్తోంది. ఇంకో వ‌ర్గం జాన్స‌న్ నాయ‌క్ కులానికి సంబంధించి ఆధారాల‌తో న్యాయస్థానాన్ని ఆశ్ర‌యించేందుకు సిద్ధం అవుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో జాన్స‌న్ నాయ‌క్ జ‌నంలోకి ఎలా వెళ్తార‌నేది ఆస‌క్తిగా మారింది. ఇవాళో, రేపో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చాక దీనిపై స్పందిస్తారేమో చూడాలి మ‌రి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like