ఎమ్మెల్యే వేధింపుల కేసు.. రంగంలోకి తెలంగాణ పోలీస్

BRS MLA:బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య షేజల్ అనే మహిళ పై వేదింపుల ఆరోపణలపై తెలంగాణ పోలిసులు ఎట్టకేలకు స్పందించారు. మహిళా విభాగం ఏసీపీ షేజల్ కి ఫోన్ చేసి వివరాలు, ఆధారాలు సేకరించారు. ఇప్పటికే ఒక దఫా వివరాలు సేకరించిన తెలంగాణ మహిళా విభాగం ఏసీపీ గురువారం మళ్ళీ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆరిజన్ డెయిరీ సీఈవో షేజల్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై పెద్ద ఎత్తున అరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, డబ్బులు తీసుకుని మోసం చేశారని దుయ్యబట్టారు. తెలంగాణలో పలువురికి ఫిర్యాదు చేసిన ఆమె ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్ కు సైతం ఫిర్యాదు చేసారు. దీంతో 15 రోజుల్లో నివేదిక అందించాలని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించిన నేపధ్యంలో పోలీసులూ ముందుకు కదిలారు. గతంలో తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని షేజల్ ఆరోపించింది. ఎట్టకేలకు తెలంగాణ పోలీస్ శాఖ స్పందించడంతో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది.