రాష్ట్ర స్థాయిలో బెల్లంపల్లి పాలిటెక్నిక్ విద్యార్థుల ఘన విజయం
TG ECET–2026 మైనింగ్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో అగ్ర ర్యాంకులు
గవర్నమెంట్ పాలిటెక్నిక్, బెల్లంపల్లి విద్యార్థులు తెలంగాణ ఈసెట్ (TG ECET)–2026లో మైనింగ్ ఇంజినీరింగ్ విభాగంలో అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో అత్యున్నత ర్యాంకులు సాధించారు. కళాశాల విద్యార్థులు రాష్ట్రంలో 1, 2, 5 ర్యాంకులను కైవసం చేసుకొని కళాశాలకు ఖ్యాతి తీసుకొచ్చారు. రాష్ట్ర 1వ ర్యాంకు సాధించిన సామల మహేష్ మాట్లాడుతూ, తన విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం, కళాశాల ప్రిన్సిపాల్ ఎం. దేవేందర్, మైనింగ్ విభాగ అధ్యాపకులు అందించిన ఉత్తమ శిక్షణ కారణమని తెలిపారు. భవిష్యత్తులో GATEలో అగ్ర ర్యాంకు సాధించి IITలో ఉన్నత విద్యను అభ్యసించి, సింగరేణి.. కోల్ ఇండియా వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో మైనింగ్ ఇంజినీర్‌గా సేవలందించాలనే లక్ష్యాన్ని వెల్లడించారు.
ఇక, రాష్ట్ర 2వ ర్యాంకు సాధించిన మొహమ్మద్ ఖాజీముద్దీన్ మాట్లాడుతూ, గవర్నమెంట్ పాలిటెక్నిక్ బెల్లంపల్లి అందించిన విద్య వాతావరణం అధ్యాపకుల అంకితభావంతో కూడిన బోధన తన విజయానికి ప్రధాన కారణమని తెలిపారు. భవిష్యత్తులో సమర్థవంతమైన మైనింగ్ ఇంజినీర్‌గా ఎదిగి గనుల రంగ అభివృద్ధికి సేవలందించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. రాష్ట్ర 5వ ర్యాంకు సాధించిన కె. సాయి చరణ్ మాట్లాడుతూ, ఇంటర్మీడియట్‌కు బదులుగా పాలిటెక్నిక్ విద్యను ఎంచుకోవడానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, కళాశాల అధ్యాపకుల మార్గదర్శకత్వం ఎంతో దోహదపడిందన్నారు. తన జీవితంలో ఈ విజయానికి కళాశాల చేసిన సేవలను ఎప్పటికీ మరువనని, భవిష్యత్తులో కోల్ ఇండియా సీఎండీ స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో కృషి చేస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం. దేవేందర్ అధ్యాపకులు మాట్లాడుతూ, విద్యార్థుల కృషి, అధ్యాపకుల నిబద్ధత, తల్లిదండ్రుల సహకార ఫలితంగానే ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో మైనింగ్ విభాగంలో 1వ, 2వ, 5వ ర్యాంకులతో పాటు టాప్-30లో సుమారు 15 ర్యాంకులు సాధించడం గవర్నమెంట్ పాలిటెక్నిక్ బెల్లంపల్లి ప్రతిష్ఠను మరింత పెంచిందని పేర్కొన్నారు.
కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తల్లిదండ్రులు విజేతలను అభినందించి వారి భవిష్యత్తు ఉన్నత విజయాలతో నిండాలని ఆకాంక్షించారు.