ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
Suicide:తన ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో చోటుచేసుకున్నది. శభాష్‌పల్లి వంతెన వద్ద మిడ్ మానేరులో దూకి ముగ్గురు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య చేసుకున్నది. మృతుల్లో నాలుగు నెలల పసికందు కూడా ఉన్నది. జలాశయంలో తేలియాడుతున్న మృతదేహాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. మృతులు రజిత ఆమె కుమారులు ఉస్మాన్ అహ్మద్ (14), అయాన్ (7), అశ్రజాబిన్ 4 నెలలుగా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరానికి చెందిన రజిత కరీంనగర్‌లోని సుభాష్ నగర్‌కి చెందిన మహ్మద్ అలీ 9 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. పెళ్లి అయిన తర్వాత దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతూ ఉండేవి. పుట్టింటి నుంచి డబ్బు తీసుకురావాలని అలీ భార్యను వేధించేవాడు. ఈ క్రమంలో రజిత పుట్టింటి వారు వేములవాడ పోలీసు స్టేషన్‌లో అలీపై ఫిర్యాదు చేశారు. అలీని స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఇరువురు రాజీ పడటంతో కేసును కొట్టివేశారు.
మూడు రోజుల కిందట రజితను పుట్టింట్లో దించిన అలీ డబ్బులు తీసుకొస్తేనే తన వద్దకు రావాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత తమ వద్ద డబ్బులు లేవని భర్త వద్దకు వెళ్లాలని పుట్టింటివాళ్లు సూచించారు. దీంతో మనస్థాపం చెందిన రజిత తన ముగ్గురు పిల్లలతో కలిసి మిడ్ మానేర్ జలాశయంలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.