ఫ్లాష్.. ఫ్లాష్.. రైలు ఢీ కొని పెద్ద పులి మృతి

ఈ మధ్య కాలంలో పులుల సంచారం పెరిగింది. అదే సమయాల్లో వాటి మరణాలు కూడా పెరుగుతున్నాయి.
కర్నూలు జిల్లా నంద్యాలలోని నల్లమల అడవుల్లో గూడ్స్ రైలు ఢీకొని ఓ పెద్దపులి మృతి చెందింది. నంద్యాల-గుంటూరు మార్గం చలమ రేంజ్ పరిధిలోని చిన్న టన్నెల్ వద్ద ఈ ఘటన జరగినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. నంద్యాల వైపు వస్తున్న గూడ్స్ రైలు ఢీకొట్టడం వల్లే పెద్దపులి చనిపోయినట్లు పేర్కొంటున్నారు. పులి కళేబరాన్ని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకొని కార్యాలయానికి తరలించారు. కాగా.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో పులుల సంచారం పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఇదిలాఉంటే.. తెలంగాణలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కరకగూడెం అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. తాడ్వాయి అటవీ ప్రాంతం నుంచి కరకగూడెం అడవుల్లోకి పెద్దపులి ప్రవేశించినట్లు అటవీ అధికారులు తెలిపారు. రఘునాదపాలెం అటవీ ప్రాంతంలో పశువుల కాపరులు పశువులను మేపుతుండగా.. పెద్దపులి వారి కంట పడటంతో అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు.. పులి పాదముద్రలను పరిశీలించారు. ఆ పాదముద్రల ఆధారంగా పులి సంచారాన్ని నిర్ధారించారు. ఎవరూ అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు.