ఆదిలాబాద్ @ 44.5

Killer Heatwaves In Telangana: తెలంగాణ(Telangana) వ్యాప్తంగా ఎండ‌లు దంచికొడుతున్నాయి. వేసవిలో  తీవ్రమైన వేడిగాలులు (Killer Heatwaves) సాధార‌ణంగా మే నెల‌లో వ‌స్తాయి. కానీ, ఈ ఎండాకాలంలో ఇప్పుడే వ‌స్తున్నాయంటే ప‌రిస్థితి ముందు ముందు మ‌రింత భ‌యంక‌రంగా ఉంటుంద‌ని చెబుతున్నారు. ఈ వేడిగాలుల కార‌ణంగా తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు న‌మోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్ర‌తలు న‌మోదు అయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ లో 44.5 డిగ్రీల అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త న‌మోదు అయ్యింది. నిర్మల్ జిల్లా సారంగాపూర్ లో 44.3, కొమురం భీం జిల్లా కెరమెరిలో 44.1, మంచిర్యాల జిల్లా భీమారం లో 43.6 డిగ్రీలుగా నమోదయ్యాయి. సాధారణం కంటే సుమారు 3.5 డిగ్రీలు అధికంగా ఉండటం పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది.

తెలంగాణకు రెడ్ అలర్ట్
ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో ఏప్రిల్ 30 వరకు ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల వరకు వెళ్లే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం, మంగళవారం రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 1 నుంచి 2 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. అయితే, కొంత ఉపశమనం కలిగించేలా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ అదే ప‌రిస్థితి…
ఆంధ్రప్రదేశ్‌లో సైతం ఎండల తీవ్రత ఎక్కువ‌గానే ఉంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆదివారం అనంతపురంలో ఏకంగా 44.8 డిగ్రీలు, కంభంలో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లోని సుమారు 198 మండలాల్లో ఎండలు 41 డిగ్రీలు దాటేశాయి. వాయువ్య దిశ నుంచి వీస్తున్న వేడి గాలుల వల్ల ప్రజలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు.

ప్రజలకు అవసరమైన జాగ్రత్తలు (Safety Measures)
ఇలాంటి వాతావరణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.

సమయం: ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం మంచిది.

హైడ్రేషన్: దాహం వేయకపోయినా తరచుగా నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ (ORS), లేదా కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండాలి.

దుస్తులు: లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలి. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ లేదా కర్చీఫ్ తప్పనిసరిగా వాడాలి.

ఆహారం: నూనెలో వేయించిన పదార్థాల కంటే, నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు (పుచ్చకాయ, దోసకాయ) తీసుకోవాలి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like