కేంద్రానికి ఘోరీ కడతాం
బీజేపీ నేతలు రాక్షసులు - కేసీఆర్‌ను విమర్శిస్తే సహించేది లేదు - ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్
రైతుల ఉసురుపోసుకుంటున్న కేంద్రానికి ఘోరీ కడదామని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయనందుకు నిరసనగా చెన్నూరులో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఆయన మాట్లాడుతూ వరిధాన్యం కొనేది లేదన్న కేంద్ర ప్రభుత్వ దుర్మార్గమైన నిర్ణయానికి వ్యతిరేకంగా, తెలంగాణ రైతాంగానికి మద్దతు తెలపడం కోసమే ధర్నా కార్యక్రమం చేపట్టినట్లు స్పష్టం చేశారు. కేంద్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. కేంద్రం వరి రైతులకు ఉరి వేస్తోందన్నారు. నమ్మి నలుగురు ఎంపీలను గెలిపిస్తే రైతులను నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లకి అబద్ధాల మీద ఉన్న ప్రేమ ఆదుకోవడంలో ఉండదన్నారు. అంబానీ, అదాని మీద ఉన్న ప్రేమ అన్నం పెట్టే రైతులపై లేదని దుయ్యబట్టారు. పంజాబ్‌లో పూర్తిస్థాయి ధాన్యం సేకరిస్తున్నరు. తెలంగాణ వడ్లను కేంద్రం కొంటదా? కొనదా? సమాధానం చెప్పేదాకా బీజేపీని, కేంద్రాన్ని వదిలిపెట్టేది లేదని అన్నారు. తెలంగాణలో వడ్లను కొంటరో? లేదో? సూటిగా చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పాలని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలులో కేంద్రం కుటిలనీతిని బయటపెట్టాలని, రైతులకు నిజం తెలియాల్సిందేనని బిజెపి నాయకులను నిలదీశారు. రైతులు ధైర్యం కోల్పోకుండా, వారి ఆర్థిక పరిస్థితి దిగజారి పోకుండా ఉండాలంటే ఇతర పంటలు వేయాల్సిన అనివార్య పరిస్థితులు కేంద్రం తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలతో దేశ రైతాంగం నడ్డి విరుస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ వాళ్లను ఎక్కడికక్కడ నిలదీయాలన్నారు. ఉచిత కరెంట్, సాగునీరు, రైతుబంధు, రైతుభీమా వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణ ప్రభుత్వం రైతును రాజుని చేయడానికి కృషి చేస్తున్నదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ పచ్చని పైరుతో కలకలలాడుతూ ఉంటే కళ్ళు మండి ఇలాంటి కుట్రలకు తెరలేపుతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తుంటే కేంద్ర ప్రభుత్వం మోటార్లకు విద్యుత్ మీటర్లు అమర్చి పన్నులు వసూలు చేయాలని కుట్ర చేస్తోందని చెప్పారు.
బీజేపీ నేతలు రాక్షసులు…
రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీలో పోరాటం చేస్తే వేలమంది సాయుధ బలగాలను మోహరించి రైతుల తలలు పగలగొట్టిన దుర్మార్గమైన పాలన మోడీదని దుయ్యబట్టారు. ధర్నా చేస్తున్న రైతులపై జీపును ఎక్కించి నలుగురి రైతుల ప్రాణాలు తీసుకున్న రాక్షసులు బిజెపి నాయకులన్నారు. ధర్నా చేస్తున్న రైతుల తలలు పగలగొట్టాలని బీజేపీ మంత్రులే బహిరంగంగా ఆదేశాలు ఇస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సంవత్సరకాలంగా రైతులు సుదీర్ఘ పోరాటం చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని స్పష్టం చేశారు. త్వరలోనే చెన్నూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా చెన్నూరు నియోజకవర్గంలో సాగునీరు అందిస్తామన్నారు. ఇప్పటికే డి పి ఆర్ పూర్తి చేసుకొని, త్వరలోనే పాలనాపరమైన అనుమతులు పొందనున్నామని చెప్పారు. మాది రైతు ప్రభుత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఉన్నంతకాలం కెసిఆర్ నాయకత్వంలో రైతులకు ఎలాంటి నష్టం జరగబోనివ్వమని చెప్పారు. బీజేపీ నాయకులు కేసీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శిస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.