అవిశ్వాసంపై లోక్‌సభలో చర్చ
ప్రారంభించనున్న రాహుల్ గాంధీ
Lok Sabha:నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంపై ఈ రోజు పార్లమెంట్‌లో చర్చ సాగనుంది. కొత్తగా తిరిగి పార్లమెంటులో చేరిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చర్చను ప్రారంభిస్తారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నారు. మోదీ ఇంటి పేరుపై రాహుల్ చేసిన వ్యాఖ్యలతో ఆయన చిక్కుల్లో పడ్డారు. దీనిపై కోర్టు రెండేళ్ల శిక్షను ఖరారు చేసింది. శిక్షపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. దీంతో తిరిగి రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని లోక్‌సభ సెక్రటేరియట్ పునరుద్ధరించింది. అనర్హత వేటు రద్దయి సభ్యత్వం తిరిగి పొందడంతో రాహుల్ పార్లమెంటు గడప తొక్కారు.
సోమవారం పార్లమెంట్‌లో అడుగుపెట్టిన రాహుల్ ఎన్‌డీఏ సర్కారుపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై (No-confidence motion) చర్చ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ ప్రారంభించనున్నారు. రాహుల్ పార్టీ సహచరులు గౌరవ్ గొగోయ్, మనీష్ తివారీ కాంగ్రెస్ నుంచి ఇతర వక్తలుగా ఉంటారని వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 7, 2023న రాష్ట్రపతి ప్రసంగంపై చర్చలో పాల్గొన్నప్పుడు రాహుల్ లోక్‌సభలో చివరి ప్రసంగం చేశారు.
అవిశ్వాస తీర్మాణానికి సంబంధించి చర్చకు 12 గంటల సమయం నిర్ణయించారు. ఇందులో భారతీయ జనతా పార్టీకి 6 గంటల 41 నిమిషాలు, కాంగ్రెస్ పార్టీకి గంటా 15 నిమిషాల సమయం నిర్ణయించారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ), శివసేన, జనతాదళ్ -యునైటెడ్ (జేడీయు), బిజూ జనతాదళ్ (బీజేడి), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్), లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ)లకు మొత్తం 2 గంటల సమయం ఇచ్చారు.