కేరళ ఇక నుంచి ‘‘కేరళం’’
-అసెంబ్లీలో ఆమోదం
-కేంద్రాన్ని కోరుతూ తీర్మానం

Kerala:కేరళ రాష్ట్రం ‘కేరళం’గా మారనుంది. తమ రాష్ట్రం పేరు మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరారు. ఇందుకు సంబంధించి కేరళలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఎలాంటి సవరణలు లేకుండా ఏకగ్రీవంగా ఆమోదించారు.
తీర్మానం ప్రవేశ పెట్టిన సందర్భంగా అసెంబ్లీలో సీఎం పినరయి మాట్లాడుతూ “భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో పొందుపరిచిన అన్ని భాషల్లో రాష్ట్ర అధికారిక పేరును ‘కేరళం’గా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ తీర్మానం చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రతిపాదన ఏకగ్రీవంగా ఆమోదించారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష కూటమి యుడిఎఫ్ (యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్) ఎలాంటి సవరణలు, మార్పులు సూచించకుండానే ప్రతిపాదనకు ఓకే చెప్పింది.
‘మలయాళ భాషలో మన రాష్ట్రం పేరు కేరళం. 1956 నవంబర్ 1న భాష ప్రాతిపదికన రాష్ట్రాలు పునర్వ్యవస్థీకరించారు. మలయాళం మాతృభాష మాట్లాడే ప్రజల కోసం ఐక్య కేరళ డిమాండ్ స్వాతంత్య్ర పోరాట కాలం నుంచి బలంగా ఉంది. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో మన రాష్ట్రం పేరు కేరళ అని రాయబడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం దానిని ‘కేరళం’గా సవరించడానికి తక్షణ చర్యలు అవసరం’ అని తీర్మానం పేర్కొంది. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రం పేరు కేరళగా మార్చడానికి చర్యలు తీసుకోవాలని ఈ అసెంబ్లీ కేంద్ర ప్రభుత్వాన్ని ఏకగ్రీవంగా అభ్యర్థిస్తోంది. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో పేర్కొన్న అన్ని భాషల్లో రాష్ట్రం పేరు కేరళంగా మార్చాలని అసెంబ్లీ అభ్యర్థిస్తోంద’ని ముఖ్యమంత్రి విజయన్ తెలిపారు.
మన మలయాళంలో ‘కేరళం’ అని.. ఇతర భాషల్లో కేరళ అని పిలుస్తారని సీఎం చెప్పారు. వాస్తవానికి కేరళ ప్రజలు కేరళంగానే వ్యవహరిస్తారు.