ఆర్డీవో పోస్టింగ్‌పై వివాదం
Manchiryal: బెల్లంపల్లి ఆర్డీవోగా కాసబోయిన సురేష్‌ను నియమించడం పట్ల వివాదం రాజుకుంటోంది. మంచిర్యాల కలెక్టరేట్ ఏవో (డిప్యూటీ కలెక్టర్)గా ఉన్న ఆయనను బెల్లంపల్లి ఆర్డీవోగా నియమించారు. ఆయన ఏడేండ్లుగా జిల్లాలోనే వివిధ హోదాల్లో పనిచేశారు. చాలా మండలాల్లో తహసీల్దార్ గా సైతం విధులు నిర్వహించారు. మంచిర్యాల, బెల్లంపల్లి సబ్ డివిజన్లో పనిచేశారు. మొన్నటికి మొన్న జరిగిన బదిలీల్లో ఆయనను సిద్దిపేటకు బదిలీ చేశారు. కలెక్టరేట్ ఏవోగా పనిచేస్తున్న ఆయనను డిప్యూటీ కలెక్టర్‌గా ప్రమోషన్ మీద నెల 4న సిద్దిపేటకు బదిలీ చేశారు. కేవలం వారం రోజుల్లో ఆయన తిరిగి జిల్లాకు వచ్చారు. అది కూడా బెల్లంపల్లి ఆర్డీవోగా వచ్చారు. దీంతో అది వివాదం అవుతోంది. గతంలో అతనిపై వివిధ రకాలైన ఆరోపణలు ఉన్నాయి.
గతంలో జరిగిన ఎన్నికల్లో సైతం ఆయన ఇక్కడే విధులు నిర్వహించడం గమనార్హం. ఆయన గురించి ఓ శాసనసభ్యుడు ఇచ్చిన సిఫారసు లేఖ మేరకు ఆయన అనుకున్న చోటికే వచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి ఎన్నికల బదిలీలకు సంబంధించి ఎన్నికల సంఘం ఎన్నో మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటన్నింటిని కాదని ఆయనకు ఇక్కడే విధులు కేటాయించడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఆయా జిల్లాల్లో స్థానికులైన వారిని, దీర్ఘకాలంగా ఉన్న వారిని బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. స్థానికులు, ఏళ్లుగా ఇక్కడే ఉన్న సీనియర్ అధికారులు ఎన్నికల సమయంలోనూ ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈనేపథ్యంలో అలాంటి అధికారులను ఎన్నికలకు ముందే బదిలీ చేయాలంటూ ఆదేశిస్తుంది. ప్రధానంగా రెవెన్యూ, పోలీసుశాఖలు ఎన్నికల్లో ప్రభావవంతంగా పనిచేస్తాయి. అందువల్ల బదిలీల సమయంలో ఎక్కువగా ఈ రెండుశాఖలపైనే దృష్టి ఉంటుంది. ఎన్నికలు పూర్తి పారదర్శకంగా నిర్వహించే క్రమంలో ఎన్నికల కమిషన్ పకడ్బందీ చర్యలు చేపడుతుంది.
అయితే, అవేమీ లెక్క చేయని అధికారులు బదిలీలు ఇష్టారాజ్యంగా చేపడుతున్నారు. సురేష్ ఏడేండ్లుగా ఇదే జిల్లాలో పనిచేస్తున్నారు. అయినా, తనకు ఇక్కడే ఆర్డీవో పోస్టింగ్‌గా ఇవ్వడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ మరో విషయం ఏమిటంటే గతంలో నిర్వహించిన ఎన్నికల సమయంలో ఎక్కడైతే ఉంటారో అక్కడ వారు ఎట్టి పరిస్థితుల్లో ఉండటానికి వీలు లేదు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల్లో ఈ విషయం చాలా స్పష్టంగా ఉంది. అయినా నిబంధనలు ఏవీ తమకు పట్టనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు.
ఆర్డీవో సురేష్ ఎన్నికల్లో ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని ప్రతిపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని పలు పార్టీల నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. కొన్ని సంఘాల నాయకులు సైతం ఈ వ్యవహారంపై ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.