గని ప్రమాద ఘటనలో ముగ్గురి సస్పెన్షన్..
డిప్యూటీ మేనేజర్ తో సహా ఇద్దరు సూపర్వైజర్ల సస్పెన్షన్ - గని మేనేజర్ కు చార్జీషీట్ జారీ - వారంలోగా మృతుల వారసులకు ఉద్యోగాలు
శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పీ 3 & 3ఏ ఇంక్లైన్ గనిలో బుధవారం జరిగిన ప్రమాద ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందిన విషయాన్ని తీవ్రంగా పరిగణించిన యాజమాన్యం, తన ప్రాథమిక విచారణ లో బాధ్యులుగా గుర్తించిన ముగ్గురిపై సస్పెన్షన్ వేటు వేసింది. వీరిలో డిప్యూటీ మేనేజర్ తో సహా, సంబంధిత షిఫ్ట్ ఓవర్మెన్, మైనింగ్ సర్దార్ లను సస్పెండ్ చేయడంతో పాటు గని మేనేజర్ చార్జీషీట్ జారీచేస్తూ శుక్రవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేసింది. రక్షణ పై అలసత్వంతో వ్యవహరించే వారు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. గని ప్రమాద ఘటన విషయంలో ఇంత వేగంగా చర్యలు చేపట్టడం సింగరేణి చరిత్రలో ఇదే ప్రథమం.
సంస్థ సీ ఎండీ ఎన్.శ్రీధర్ ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే తక్షణ విచారణకు ఆదేశించిన విషయం విదితమే. డైరెక్టర్ (పర్సనల్, ప్రాజెక్స్ట్ అండ్ ప్లానింగ్, ఫైనాన్స్) బలరామ్ ను తక్షణమే గనికి వెళ్లి ప్రాథమిక విచారణ జరిపి నివేదించాలని ఆదేశించారు. గురువారం ఉదయం గనిలోకి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. ఈ విషయంపై సమగ్ర విచారణ కొనసాగించే క్రమంలో ప్రాథమికంగా బాధ్యులుగా గుర్తించిన ముగ్గురుని తక్షణమే సస్పెండ్ చేయాలని, మేనేజర్ కు చార్జీషీట్ ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది.
రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉత్పత్తి సాధించాలని తాను పదేపదే సూచిస్తున్నానని, రక్షణ పెంపుదలకు పరిమితులు లేకుండా నిధులు కూడా మంజూరు చేస్తున్నామని, రక్షణపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని డైరెక్టర్ (పర్సనల్, ప్రాజెక్స్ట్ అండ్ ప్లానింగ్, ఫైనాన్స్) బలరామ్ కోరారు.
రక్షణ విషయంలో పొరపాట్లు కార్మికుల విలువైన ప్రాణాలను హరిస్తున్నాయని, కనుక రక్షణ విషయంలో అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా ఉండే వారిపట్ల యాజమాన్యం కఠినమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఈ విషయంలో అధికారులు, కార్మికులు అనే తేడా లేకుండా చర్యలు కఠినంగా ఉంటాయని స్పష్టం చేశారు. కనుక రక్షణ విషయంలో మరింత శ్రద్ధతో చర్యలు తీసుకోవాలని ఆయన సింగరేణి వ్యాప్త గనుల అధికారులకు, ఉద్యోగులకు సూచించారు.
వారంలోగా వారసులకు ఉద్యోగాలు..
కాగా, గని ప్రమాదంలో మృతి చెందిన నలుగురు కార్మికుల పట్ల ప్రగాఢ సానుభూతిని ప్రకటించిన యాజమాన్యం వారి కుటుంబ సభ్యులను గురువారం స్వయంగా వారి స్వగ్రామాలకు వెళ్లి కంపెనీ పరంగా అందాల్సి ఉన్న ఎక్స్గ్రేషియాను వారికి అందజేశారు. మిగిలిన మ్యాచింగ్ గ్రాంట్, ఇతర ప్రయోజనాలను వీలైనంత త్వరగా అందజేయడానికి యాజమాన్యం సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది.
సీ అండ్ ఎండి .శ్రీధర్ ఆదేశం మేరకు మృతుల కుటుంబీకుల్లో అర్హులైన ఒకరికి వారం రోజుల్లోగా ఉద్యోగం కల్పించనున్నారు. ఈ మేరకు డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్, పి అండ్ పి) .బలరామ్ శుక్రవారం మాట్లాడుతూ.. ప్రత్యేక పరిస్థితులను దృష్టి లో పెట్టుకొని నియామక ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని, వారం లోగా ఉద్యోగ నియామక పత్రాలు అందించడమే కాకుండా వారు కోరుకున్న ఏరియాలో పోస్టింగులు కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు.