కొవిడ్ మరణ నిర్ధారణ కోసం త్రిసభ్య కమిటీ
జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలతో కొవిడ్-19 మరణ నిర్ధారణ కోసం జిల్లాస్థాయి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కమిటీలో చైర్మన్ జిల్లా కలెక్టర్, కన్వీనర్ గా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, సభ్యులుగా జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు వ్యవహరిస్తారని, కమిటీ మరణ ధ్రువీకరణ విషయమై సందేహాలు, సమస్యల నివృత్తి కమిటీ గా పనిచేస్తుందని తెలిపారు. కొవిడ్ తో మరణించిన వారి రక్త సంబంధీకులు మీ సేవ కేంద్రం ద్వారా మరణ దస్తావేజు కోసం దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు కమిటీ అన్ని విధాలుగా పరీక్షించి నిర్ధారణకు వచ్చిన తర్వాత నిర్ణీత ఫార్మాట్ లో మరణ దస్తావేజు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. మరణ దస్తావేజు జారీ కోసం దరఖాస్తు, సందేహ నివృత్తి, అభ్యర్థనలను దరఖాస్తు అందిన తర్వాత 30 రోజుల లోగా పూర్తి చేయవలసి ఉంటుందని, సంబంధిత దస్తావేజులను చీఫ్ రిజిస్ట్రార్ ఆఫ్ స్టేట్, రిజిస్ట్రార్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ లకు సమాచారం నిమిత్తం అందజేయడం జరుగుతుందని తెలిపారు.