హామీ వచ్చిందా..?
-కాంగ్రెస్ లోకి ఉద్యోగ సంఘం నేత అజ్మీరా శ్యాం నాయక్
-తనకు టిక్కెట్టు రాదని స్పష్టం అయ్యాకే చేరిక
-హస్తం పార్టీ నుంచి హామీ వచ్చిందనే సంకేతాలు
ఖానాపూర్ శాసససభ్యురాలు రేఖా నాయక్ భర్త, ఉద్యోగ సంఘం నేత అజ్మీరా శ్యాం నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగిత్యాల జిల్లా ఆర్టీవోగా పనిచేస్తున్న ఆయన కొద్ది రోజుల కిందట తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఆశించిన ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశారు. మరోవైపు ఆసిఫాబాద్ అసెంబ్లీ స్థానంపై కూడా ఆయన ఆశలు పెట్టుకున్నారు. అయితే, ఆయనకు టిక్కెట్టు ఇవ్వడం మాట అటుంచి ఆయన భార్య రేఖా నాయక్ కు సైతం టిక్కెట్టు ఇవ్వకుండా మొండి చేయి చూపారు. దీంతో ఆయన వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆయనకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
తన భార్యకు టిక్కెట్టు ఇవ్వకున్నా తనకు అటు ఆదిలాబాద్ ఎంపీ కానీ, ఆసిఫాబాద్ అసెంబ్లీ స్థానం కానీ కావాలని శ్యాం నాయక్ ప్రయత్నాలు చేశారు. చివరకు కల్వకుంట్ల కవితను సైతం కలిశారు. వారిద్దరి ప్రయత్నాలు వృథా అయ్యాయి. ఈ నేపథ్యంలోనే శ్యాం నాయక్ చక్రం తిప్పారు. రేవంత్‌రెడ్డిని కలవడం పార్టీలో చేరడం చకచకా జరిగిపోయాయి. శ్యాం నాయక్ రేవంత్ సమక్షంలో పార్టీలో చేరిన అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రేను కలిశారు. ఆయనతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్యాం నాయక్‌కు సీటు కోసం హామీ లభించినట్లు తెలుస్తోంది. అయితే, ఆయన ఆశిస్తున్నట్లుగా ఆదిలాబాద్ ఎంపీ సీటా..? లేక ఆసిఫాబాద్ అసెంబ్లీ సీటా..? అనేది స్పష్టత రావాల్సి ఉంది.