చిన్నయ్యకు తప్ప… ఎవరికైనా ఓటేయండి

Durgam Chinnayya: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను తనను లైంగికంగా వేధించాడని, ఇబ్బందులకు గురిచేశాడని ఆరోపించిన యువతి షేజల్ శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలో ప్రచారం ప్రారంభించారు. బెల్లంపల్లి పట్టణంలో దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా ఆమె షాపుల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. తనకు అన్యాయం జరిగిందని షాపుల్లో తిరుగుతూ చెబుతున్నారు. ఎన్నిమార్లు ప్రభుత్వానికి, పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, పోలీసులు ఆమె ప్రచారం అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో అక్కడకు చేరుకున్న బీజేపీ నేతలు గొడవ చేయడంతో ఖాకీలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, ఏ క్షణమైనా ఆమెను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో తాను దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని, ఆయన ఓటమే లక్ష్యంగా పనిచేస్తానని షేజల్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. ఆమె చెప్పినట్లుగానే ఇప్పుడు ప్రచారం చేస్తోంది. ఆమెకు మద్దతుగా బీజేపీ నేతలు సైతం పట్టణంలో తిరుగుతున్నారు.