రూ.15.70 కోట్ల బియ్యం బ్లాక్‌మార్కెట్‌.. రైస్‌మిల్లర్‌పై పీడీ యాక్ట్‌

ప్రభుత్వ బియ్యం అక్రమంగా దారి మళ్లించి బ్లాక్‌మార్కెట్‌లో విక్రయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రైస్‌మిల్లర్‌పై పోలీసులు పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. ఏకంగా రూ.15.70 కోట్ల విలువైన ప్రభుత్వ బియ్యం, ధాన్యం అక్రమంగా దారి మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. గతంలోనూ కేసులు నమోదైనా, అక్రమ కార్యకలాపాలు కొనసాగించడంతో.. ఈసారి కఠిన చర్యలు తీసుకున్నారు.

రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ప్రభుత్వ బియ్యం అక్రమ తరలింపు వ్యవహారం కలకలం రేపుతోంది. దండేపల్లి మండలం లింగాపూర్‌లోని ఎం/ఎస్‌ రామలక్ష్మణ్‌ ఇండస్ట్రీస్‌ రైస్‌మిల్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ గంప సంతోష్‌కుమార్‌పై పీడీ యాక్ట్‌ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు. బ్లాక్‌మార్కెటింగ్‌ నిరోధక, నిత్యావసర వస్తువుల సరఫరా పరిరక్షణ చట్టం–1980లోని సెక్షన్‌ 3(1), 3(2) కింద ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా తెలిపారు.

రబీ 2022–23, రబీ 2024–25 సీజన్లలో కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం ప్రభుత్వం నుంచి సంతోష్‌కుమార్‌ మొత్తం 9,244.206 మెట్రిక్‌ టన్నుల ధాన్యం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి ప్రభుత్వానికి 6,286.059 మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ అందించాల్సి ఉండగా.. ఇప్పటివరకు 1,833.511 మెట్రిక్‌ టన్నులు మాత్రమే అందించినట్లు గుర్తించారు. దీంతో ఇంకా 4,452.548 మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. దానికి సమానంగా సుమారు 6,170.643 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని దారి మళ్లించినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.

ఈ అక్రమాల కారణంగా ప్రభుత్వానికి రూ.15.14 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొన్నారు. గత సీజన్ల సీఎంఆర్‌ బకాయిలను కలుపుకుని మొత్తం నష్టం రూ.15,70,36,726గా నిర్ధారించినట్లు తెలిపారు. గంప సంతోష్‌కుమార్‌పై ప్రభుత్వ ధాన్యం దారి మళ్లింపునకు సంబంధించి 2025, 2026 సంవత్సరాల్లో దండేపల్లి, హాజీపూర్‌ పోలీస్‌స్టేషన్లలో మరో రెండు కేసులు కూడా నమోదయ్యాయి.

ప్రస్తుతం దండేపల్లి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో ఆయన రిమాండ్‌లో ఉన్నారు. గతంలో కేసులు నమోదైనప్పటికీ అక్రమ కార్యకలాపాలు కొనసాగించారని.. సాధారణ క్రిమినల్‌ చట్టాల కింద తీసుకున్న చర్యలు నిరోధక ప్రభావం చూపలేదని పోలీసులు తెలిపారు. బెయిల్‌పై విడుదలైతే మళ్లీ ఇదే తరహా అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు నివేదించడంతో.. పీడీ యాక్ట్‌ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసినట్లు సీపీ వెల్లడించారు.

లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి, దండేపల్లి ఎస్‌ఐ రాజవర్ధన్‌.. లక్షెట్టిపేట సబ్‌జైలులో ఉన్న నిందితుడికి జైలు అధికారుల సమక్షంలో పీడీ యాక్ట్‌ ఉత్తర్వులు అందజేశారు. అనంతరం అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు. ప్రభుత్వ నిత్యావసర వస్తువులను అక్రమంగా దారి మళ్లించి బ్లాక్‌మార్కెట్‌లో విక్రయించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ హెచ్చరించారు.

You might also like