హిందూ – ముస్లిం రెండు కళ్లు
“హిందూ ముస్లింల మధ్య నాకు వ్యత్యాసం లేదు. హిందూ – ముస్లింలు ఇద్దరూ నాకు రెండు కళ్లలాంటి వార”ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమితులైన అభ్యర్థులు తెలంగాణ రైజింగ్ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కొమురం భీమ్ ఆదివాసీ భవన్‌లో నిర్వహించిన తెలంగాణ మైనారిటీల ప్రతిభా సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. గ్రూప్ 1, 2, 3, 4 తదితర కేటగిరీల్లో జరిగిన ఉద్యోగ నియామకాల్లో ఎంపికైన, అలాగే నీట్, ఐఐటీ, ఎన్ఐటీ లాంటి జాతీయ స్థాయి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన 782 మంది మైనారిటీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాల్లో మైనారిటీలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వల్ల మైనారిటీలే ఎక్కువగా ప్రయోజనం పొందుతున్నారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ -1 తో పాటు ఉద్యోగ నియామకాలేవీ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్ – 1 కు సంబంధించి ఒకసారి ప్రయత్నం జరిగినప్పటికీ పల్లీ బఠానీల్లా పరీక్షా పత్రాలను మార్కెట్ లో విక్రయించారని దుయ్యబట్టారు. గ్రూప్ -1, 2 లాంటి పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయాలంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో అర్హత కలిగిన వారు సభ్యులుగా ఉండాలి కానీ, అనామకులను సర్వీసు కమిషన్‌లో నియమించారని ఎద్దేవా చేశారు.
ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను పూర్తిగా ప్రక్షాళన చేశామని రేవంత్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను అడ్డుకోవాలని అడ్డంకులు సృష్టించారని, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఉద్దండులైన న్యాయవాదులను నియమించి పోరాటం చేసి నియామకాలను పూర్తి చేశాం” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, TGMREIS ప్రెసిడెంట్ మహమ్మద్ ఫహీముద్దీన్ ఖురేషి పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.