ఎర్రకోటపై తొలిసారి ‘వందేమాతరం’
స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా ఆగస్టు 15న తొలిసారిగా ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ గీతానికి ముందు ‘వందేమాతరం’ గేయాన్ని ఆలపించనున్నారు. వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పీఎం మోదీ ఎర్రకోట వద్దకు రాగానే వందేమాతరం ఆలపిస్తారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరణ తర్వాత ‘జనగణమన’గీతాన్ని ఆలపిస్తారని రక్షణ శాఖ వెల్లడించింది.
ప్రముఖ బెంగాలీ రచయిత బంకిం చంద్ర ఛటర్జీ రచించిన ‘వందేమాతరం’ గీతం రూపుదిద్దుకుని 2026 నాటికి సరిగ్గా 150 సంవత్సరాలు పూర్తి అవుతోంది. ఈ సందర్భంగా ఆ అమర గీత వారసత్వానికి, ప్రాముఖ్యతకు ఘన నివాళిగా ఎర్రకోట బురుజుల నుంచి దీనిని ఆలపించాలని నిర్ణయించారు. సాధారణంగా ఈ గేయంలోని మొదటి రెండు చరణాలను మాత్రమే ఆలపించే సాంప్రదాయం ఉండేది. అయితే జాతీయ గీతం ‘జనగణమన’తో సమానంగా వందేమాతరానికి గౌరవం దక్కాలని, అందులోని మొత్తం ఆరు చరణాలను ఆలపించాలని కేంద్ర ప్రభుత్వం చాటి చెబుతోంది.