ఇల్లు కన్నా… జైలే పదిలం..
Chandrababu: స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టయిన మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. ఆయనకు హౌస్ రిమాండ్ లో ఉంచాలని ఏసీబీ కోర్టులో బాబు తరఫున న్యాయవాదులు పిటిషన్ వేశారు. అయితే, ఆ పిటిషన్ తోసిపుచ్చుతూ కోర్టు నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల నేపథ్యంలో ఆయనను హౌస్ రిమాండ్లో ఉంచాలని కోరుతూ ఈ పిటిషన్ వేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ముప్పులేదన్న సీఐడీ వాదనలతో ఏకీభవించింది. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు హౌస్ రిమాండ్ పిటిషన్పై అటు చంద్రబాబు లాయర్లు.. సీఐడీ లాయర్లు ఎనిమిది గంటల పాటు వాదనలు వినిపించారు. సుదీర్ఘ వాదనల అనంతరం ఇవ్వాల్టికి తీర్పు రిజర్వ్ చేసిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఇవాళ పిటిషన్ డిస్మిస్ చేశారు. చంద్రబాబు వయసు, హోదా, ఆయనకు ఉన్న భద్రత వంటి అంశాలతో హౌస్ రిమాండ్ కు అంగీకరించాలని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా న్యాయస్థానాన్ని కోరారు. అయితే, చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ కు సీఐడీ అభ్యంతరం తెలిపింది. చంద్రబాబుకి అన్ని విధాలుగా జైలే ఉత్తమం అన్న సీఐడీ వాదించింది. ఈ వాదనతో కోర్టు ఏకీభవించింది. చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ ను కొట్టివేసింది