కాంగ్రెస్‌లో లొల్లి.. జరుగుతుంది మళ్లీ..

Congress:ఓదెలు తిరిగి కాంగ్రెస్ పార్టీలో సరైన నిర్ణయమేనా…? అందులో పొసగలేకనే బయటకు వచ్చిన ఆయన తిరిగి మళ్లీ అదే పార్టీలోకి ఎందుకు వెళ్లారు..? మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు ధాటికి ఆయన తట్టుకుంటారా..? ఆయనకు అధిష్టానం ఏమైనా హామీ ఇచ్చిందా..? ఆయనకు ఎమ్మెల్యే టిక్కెట్టు ఇస్తే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న ఆశావహులు సైలెంట్ అవుతారా..? ఇవన్నీ మిలియన్ డాలర్ల ప్రశ్నలే. మరి చివరకు ఏం అవుతుంది..? ఓదెలుకు ఎమ్మెల్యే టిక్కెట్టు వస్తుందా..? కాంగ్రెస్ గ్రూప్ వార్‌లో నలిగిపోతారా..? నాంది న్యూస్ ప్రత్యేక కథనం..
నల్లాల ఓదెలు.. తెలంగాణ ఉద్యమ కారుడిగా, వ్యక్తిగతంగా సౌమ్యుడిగా పేరుంది. 2009లో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2010 ఫిబ్రవరి 14న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో మళ్లీ గెలుపొందారు. 2014లో సైతం ఎమ్మెల్యేగా గెలిచి విప్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ఆ తర్వాత ఎన్నికల్లో టిక్కెట్టు లభించలేదు. దీంతో అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్నారు. విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో ఆయనకు పొసగకపోవడంతో పార్టీని వీడారు. ఓదెలు టీఆర్‌ఎస్ పార్టీకి 2022 మే 19న రాజీనామా చేసి ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఇక్కడి వరకు అంతా బాగానే నడిచింది.
కానీ, ఆయన చేరిక ఇష్టం లేని మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు నల్లాల ఓదెలు, ఆయన భార్య మంచిర్యాల జిల్లా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ భాగ్యలక్ష్మి కాంగ్రెస్ పార్టీ వీడి బయటకు వెళ్లేంత వరకు పోరు సాగించారు. ఓదెలు కాంగ్రెస్ పార్టీలో చేరితే తన అనుచరుడికి టిక్కెట్టు ఇస్తానని ఇచ్చిన హామీ నెరవేరదనే ఉద్దేశంతో ఓదెలుకు పొమ్మనలేక పొగబెట్టారు. ఓదెలు చేరిక విషయంలో ప్రేంసాగర్ రావు మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు. ఓదెలు మొదట ప్రేంసాగర్ రావును సంప్రదించినా ఆయన సరిగ్గా స్పందించలేదు. దీంతో ఓదెలు నేరుగా రాష్ట్రంలోని నేతలను సంప్రదించి వారి ద్వారా ఢిల్లీ పెద్దలతో మంతనాలు చేసి ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ప్రేంసాగర్ రావు ఓదెలు రాకను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. తన శిష్యుడుకి చెన్నూరులో టిక్కెట్టు ఇప్పించుకుని, తన వర్గాన్ని పెంచి పోషించుకోవడం ఓదెలును వ్యతిరేకించడానికి కారణంగా కనిపిస్తోంది. ఇక రేపటి రోజున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తన పరపతి చాటుకుని తద్వారా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించాలని మాజీ ఎమ్మెల్సీ భావిస్తున్నారు. నల్లాల ఓదెలు రాక ఆయనకు మింగుడుపడని అంశంగా మారింది. దీంతో సహజంగానే ఓదెలు రాకను ప్రేంసాగర్ రావు వ్యతిరేకించడమే కాకుండా, ఆయనను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు.
అప్పటికే ఇబ్బందులను ఎదుర్కొన్న నల్లాల ఓదెలు ఇక ప్రేంసాగర్ రావుతో పొసగదని అర్ధం అయ్యాక డైలామాలో పడ్డారు. దీనిని గ్రహించిన టీఆర్ఎస్ ఆయనను తిరిగి పార్టీలోకి ఆహ్వానించింది. ఆయన 2022 అక్టోబర్ 5న ప్రగతి భవన్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. అయినా, ఆయనలో అసంతృప్తి చల్లారలేదు. ఆయన అనుచరులు కొందరు, మరికొందరు నేతలు కలిసి బీఆర్ఎస్ పార్టీ వీడాలంటూ స్పష్టం చేయడంతో బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ, ఆ పార్టీ అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఈసారి ఆయన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ద్వారా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు సరే… ఆయన ఏదైతే ఆశిస్తున్నారో..? ఆ ఎమ్మెల్యే టిక్కెట్టు దక్కుతుందా..? అంటే అనుమానమే. ఆయనకు టిక్కెట్టు రాకుండా మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు పూర్తి స్థాయిలో అడ్డు పడతారు. అంతేకాకుండా చెన్నూరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున నేతలు టిక్కెట్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడ నుంచి 13 మంది దరఖాస్తు చేసుకున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అందులో ముఖ్య నేతలు నలుగురి వరకు ఉన్నారు. ఓదెలుకు టిక్కెట్టు ఇస్తే ఖచ్చితంగా వారు వ్యతిరేకిస్తారు. అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి వరంగా మారనుంది. అదే సమయంలో ఓదెలు సొంత పార్టీలోనే బలమైన ప్రత్యర్థి ప్రేంసాగర్ రావును ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మరి నల్లాల ఓదెలుకు టిక్కెట్టు వస్తుందా… లేదా.. వచ్చినా రాకున్నా ఆయన సొంత పార్టీ కాంగ్రెస్‌లో వ్యతిరేకత మాత్రం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే. గ్రూపు రాజకీయాలను భరించి, గొడవలు, కొట్లాటలకు సిద్ధం కావాల్సిందే. లేకపోతే ఆయన మనుగడ కష్టమే. మరి ఈ విషయంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.