హామీలు అందరికీ… టిక్కెట్టు ఎవరికి..?
ఎమ్మెల్సీ అభ్యర్థిపై ఉత్కంఠ - నేడో.. రేపో ప్రకటన
కేసీఆర్ ప్రతి ఒక్కరికీ హామీ ఇచ్చారు. ప్రతి సభలో అక్కడ ఉన్న నాయకుడికి టిక్కెట్టు నీకే పో అన్నారు.. మరి ఇప్పుడు ఆశావాహులు పదుల సంఖ్యలో ఉన్నారు. ఉన్నది ఒక్కటే టిక్కెట్టు.. అది ఎవరికి ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆశావహులు ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ పురాణం సతీష్ పదవీకాలం ముగియనుండటంతో.. ఆ స్థానంలో ఎన్నిక నిర్వహిస్తున్నారు. టికెట్ ఆశిస్తున్నవారంతా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వీడి హైదరాబాద్‌లో వాలిపోయారు. ఎవరి స్థాయిలో వారు లాబీయింగ్ మొదలుపెట్టారు కూడా. తెలిసిన నేతల ద్వారా అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. తమ బయోడేటా పార్టీకి చేసిన సేవలు నివేదించారు. దీంతో ఎవరిని ఈ పదవి వరిస్తుందన్నది ఉత్కంఠగా మారింది. అధినేత మాత్రం జిల్లాలు, సామాజిక వర్గాలు, సీనియారిటీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్ రాజకీయాలు దృష్టిలో పెట్టుకొని అవకాశాలుంటాయని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.
ఆయన హామీ ఇచ్చారు.. వీరు ఆశలు పెట్టుకున్నారు..
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సభలో ఎపుడు మాట్లాడినా స్థానికంగా ఉన్న నాయకుడు ఒకరికి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో కూడా అదే పరిస్థితి. బెల్లంపల్లిలో నిర్వహించిన ఒక బహిరంగ సభలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్‌కు మంచి పదవి వస్తుందని ప్రకటించారు. ఇక మంచిర్యాలలో నిర్వహించిన సభలో సైతం మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి పేరు ప్రస్తావించారు. ఆయనకు సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తామని చెప్పారు. ఇక చాలా చోట్ల మిగతా నేతలకు సైతం ఏదో ఒక సందర్భంలో అధినేత హామీ ఇచ్చారు. దీంతో కేసీఆర్ ఎవరికి ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటారనే చర్చ సాగుతోంది.
పురాణం సతీష్‌కు రెన్యూవల్ అయ్యేనా..?
ప్రస్తుత ఎమ్మెల్సీ పురాణం సతీష్ మాత్రం టిక్కెట్టు తనకే దక్కుతుందని ధీమాగా ఉన్నారు. ఆయన అనుచరులు సైతం అదే చెబుతున్నారు. పురాణం సతీష్ ఎమ్మెల్సీ ఉన్నన్నీ రోజులు వివాదరహితుడిగా ఉన్నారు. ఆయన మీద అధినేతకు కూడా మంచి గురి ఉంది. మరోవైపు ఉద్యమ సమయంలో ఆయన పార్టీకి చేసిన సేవలు సైతం అధినేత పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. దీంతో ఆయన పేరు తిరిగి ఎంపిక చేస్తారా..? లఏదా…? అన్నది తేలాల్సి ఉంది. ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆ కోణంలో సైతం ఎంపిక చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. తనకు ఖచ్చితంగా మరోసారి అవకాశం ఇస్తారనే లెక్కల్లో ఉన్నారు పురాణం.
ఆశల పల్లకిలో గ్రంథాలయ సంస్థ చైర్మన్..
ఇక మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ సైతం తనకు ఎమ్మెల్సీ టిక్కెట్టు వస్తుందని భావిస్తున్నారు. ఆయన సామాజిక వర్గంతో పాటు విప్ బాల్క సుమన్ శిష్యుడిగా పేరుంది. ఈ రెండు అంశాలు ఆయనకు కలిసి వస్తాయి. అదే సమయంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ఆయన చేసిన పనులు సైతం ప్రవీణ్ సమర్థతను చాటి చెప్పాయి. ఇవి కూడా ఆయనకు టిక్కెట్టు వచ్చేందుకు దోహదం చేయనున్నాయి. ఇక ఏ కార్యక్రమం జరిగినా అది జిల్లా స్థాయిలో అయినా, రాష్ట్ర స్థాయిలో అయినా సుమన్ వెంటే ఉండి అందరి నోళ్లలో నానిన వ్యక్తి కావడంతో అది ప్లస్‌పాయింట్‌గా మారనుంది.
నిర్మల్ జిల్లా నుంచి ముగ్గురు ఆశావహులు..!
నిర్మల్ జిల్లా నుంచి సైతం ముగ్గురు ఆశావహులు బరిలో ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, సీనియర్ నేతలు శ్రీహరిరావు, సత్యనారాయణ గౌడ్‌లు అధిష్ఠానం దగ్గర అర్జీ పెట్టుకున్నట్టు సమాచారం. కొమురం భీం జిల్లా నుంచి అరిగెల నాగేశ్వరరావు పేరు కూడా రేస్‌లో వినిపిస్తోంది. యాదవ సామాజికవర్గం కోటాలో తప్పకుండా పట్టం కడతారని ఆయన అనుకుంటున్నారట. మంచిర్యాల జిల్లాకు చెందిన అరవిందరెడ్డి సైతం నేనున్నాను అని ముందుకొస్తున్నారు. అధినేత మాత్రం ఇప్పటికే ముగ్గురు పేర్లతో జాబితాను షార్ట్ లిస్ట్ చేశారని టీఆర్ఎస్ వర్గాల టాక్. పార్టీ అధికారిక ప్రకటన రాకముందే అనుచరులు తమ నేతకే టికెట్ కన్ఫామ్ అని సోషల్ మీడియాలో మాత్రం ఊదరగొడుతున్నాయి.
ఆదివాసీల వైపే మొగ్గు చూపుతారా..?
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అధిష్ఠానం ఆదివాసీ నేత వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన మాజీ ఎంపీ గోడం నగేష్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే హామీ ఇచ్చినట్లు సమాచారం. బీజేపీ ఎంపీ సోయం బాపురావ్ దూకుడుకు చెక్ పెట్టేందుకు జిల్లాకు చెందిన ఆదివాసీ నేతకే ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టాలన్న ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్లు ఓ సీనియర్ నేత పేర్కొంటున్నారు. అధికార పార్టీపై ఆదివాసీల్లో కొంత వ్యతిరేకత ఉన్నందునే ఆ సామాజిక వర్గానికి దగ్గరయ్యేందు కు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రం, ప్రత్యేక రాష్ట్రంలోనూ ఆదివాసీలకు ఎమ్మెల్సీ పదవిని కేటాయించ లేదు. ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీకి ఎమ్మెల్సీ పదవిని కట్టబెడితే పార్టీకి కొంత కలిసి వస్తుందన్న భావనతో పార్టీ పెద్దలు ఉన్నట్లు కనిపిస్తోంది.