దుర్గం కోటకు బీటలు
-ఎన్నికల్లో ఎదురీదుతున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
ఆయన వెంట ఉన్న వారంతా కాంగ్రెస్ వైపు పయనం
సొంత సామాజిక వర్గం నేతలూ దూరమవుతున్న వైనం
కంటిలో నలుసులా మారిన షేజల్ వ్యవహారం
మరి గెలుపు కోసం ఆయన ఏం చేస్తారనేది సస్పెన్స్

దుర్గం చిన్నయ్యకు గతంలో మద్దతుగా నిలిచిన వర్గాలన్నీ దూరం అవుతున్నాయా..? ఆయన గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన వారిలో చాలా మంది కాంగ్రెస్‌లో చేరడంతో చిన్నయ్య ఈ ఎన్నికల్లో బలహీనపడ్డారా..? ముఖ్యంగా షేజల్ ఎపిసోడ్ ఆయనకు మహిళా వర్గాలను దూరం చేసిందా..? చివరకు ఆయన సామాజిక వర్గం సైతం దుర్గం చిన్నయ్యకు దూరం కావడానికి కారణాలేంటి..? బెల్లంపల్లి చిన్నయ్య గెలుపు ఓటములపై ప్రభావం చూపే అంశాలపై నాంది న్యూస్ ప్రత్యేక కథనం..
ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో దుర్గం చిన్నయ్యకు గెలుపు టెన్షన్ పట్టుకుంది. గతంలో తన వెంట ఉన్న చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయనకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. ఎన్నికల ప్రచారం సైతం సరిగ్గా నిర్వహించడం లేదనే ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల ప్రచారం చేస్తున్నా పూర్తి స్థాయిలో జరగడం లేదు. తాండూరు మండలం నుంచి సిరంగి శంకర్, వేమనపల్లి, కాసిపేట, బెల్లంపల్లి, నెన్నల తదితర ప్రాంతాల నుంచి కాంగ్రెస్లో చేరారు. వీరితో పాటు ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన వారు సైతం ఆయనకు దూరమయ్యారు. కాసిపేట మండలం నేతకాని మహార్ సంఘం రాష్ట్ర కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దుర్గం గోపాల్, మాజీ ఎంపీటీసీ దుర్గం లక్ష్మీ, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు కుంబాల రాజేష్, నేతకాని సంఘం జిల్లా వర్కింగ్ అధ్యక్షుడు కామెర దుర్గయ్య, బెల్లంపల్లి సోషల్ మీడియా కన్వీనర్ కాసర్ల యాదగిరి తదితరులు పార్టీని వీడి కాంగ్రెస్ బాట పట్టారు.
ఇలా సొంత సామాజిక వర్గం ఆయనకు దూరం కావడం వెనక చాలా కారణాలు ఉన్నాయని చెబుతారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో నేతకాని సామాజిక వర్గానికి 38,000 ఓట్లు ఉంటాయి. వాస్తవానికి వారే ఈ నియోజకవర్గంలో గెలుపు ఓటముల నిర్ణేతలు. అందుకే ఆ సామాజిక వర్గానికి చెందిన దుర్గం చిన్నయ్యకు టిక్కెట్టు కేటాయించారు. గత రెండు ఎన్నికల్లో ఆయన వెంట ఉన్న మెజార్టి నేతలు, ప్రజలు దూరం అయ్యారు. దళిత బంధు విషయంలో తమకు అన్యాయం జరిగిందని, చిన్నయ్య తమను సరిగ్గా పట్టించుకోలేదని నేతకాని వర్గం భావిస్తోంది. అందుకే వారంతా దుర్గం చిన్నయ్యకు దూరం కావడమే కాకుండా వారంతా కాంగ్రెస్‌లో చేరుతున్నారు.
ఇక షేజల్ వ్యవహారం సైతం ఆయనకు చాలా చిక్కులు తెచ్చి పెడుతోంది. ఆరిజన్ డైరీ సీఈవో షేజల్ తనను లైంగికంగా వేధించాడని రాష్ట్ర, దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. ఎమ్మెల్యే తమను నమ్మించి మోసం చేశాడని, మానసికంగా, లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నారని ఆందోళనకు దిగింది. డీజీపీని ఆశ్రయించిన షేజల్ మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేసింది. ఢిల్లీలో సైతం ఆందోళన చేపట్టిన ఆమె జాతీయ మహిళా కమిషన్ కు కూడా ఫిర్యాదు చేసింది. ఓ దశలో ఆత్మహత్యా యత్నం కూడా చేసింది. బెల్లంపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టింది. ఈ వ్యవహారం ఆయనకు మహిళల ఓట్లను దూరం చేయనుందని పరిశీలకులు భావిస్తున్నారు.
చాలా సందర్భాల్లో బెల్లంపల్లి పట్టణంలో భూ వివాదాల వెనక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఉన్నారనే ప్రచారం సైతం పెద్ద ఎత్తున జరిగింది. కానీ, తాను అలాంటి వాటిని ప్రోత్సహించనని భూ కబ్జాల వెనక ఎవరూ ఉన్నా వదలిపెట్టేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎన్నికల్లో దుర్గం చిన్నయ్య గెలవాలంటే ఖచ్చితంగా ఎన్నో అవాంతరాలను దాటుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంది. మరి వాటంటినీ దాటుకుని ముందుకు వెళతారా..? లేక చేతులెత్తేస్తారా..? వేచి చూడాలి.