తెలంగాణలో గొర్రెల పంపిణీ అందుకే..
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

కేంద్రం తెలంగాణకు అవార్డ్స్ ఇస్తోందని.. నిధులు మాత్రం ఇయ్యడం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దుయ్యబట్టారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడానికి గొర్రెల పంపిణీ అభివృద్ధి పథకం అమలు చేస్తున్నాంమని స్పష్టం చేశారు. ఈ పథకం అమలు చేసేందుకు రూ. 3549.98 కోట్లు NCDC ద్వారా రుణం తీసుకున్నామని వెల్లడించారు. దీంట్లో కేంద్రం వెయ్యి కోట్లు సబ్సిడీ ఇస్తామని చెప్పి ఇయ్యలేదని తలసాని మండిపడ్డారు. NCDCకి 2900.74 కోట్ల రూపాయలు రుణం తిరిగి చెల్లించామన్నారు. సకాలంలో రుణ చెల్లింపులు చేసినందుకు అభినందనలు తెలిపారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎంపీగా ఉన్న బండి సంజయ్ బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండి ఆధారాలు లేకుండా జనం మధ్యన అబద్ధం చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీజేపీ బండి సంజయ్ ని ఎలా అధ్యక్షుడిగా పెట్టుకుందన్నారు. మాట్లాడటానికి మాకు కూడా వస్తదని స్పష్టం చేశారు. అబద్దాలు, అభూతకల్పనలు సృష్టించడం దుర్మార్గమని దుయ్యబట్టారు. దమ్ముంటే గొర్రెలు పథకం దేశమంతా అమలు చేసి చూపాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ సందర్భంగా సవాల్ విసిరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చి అబద్దాలు చెప్పారని అన్నారు. రామప్ప దేవాలయానికి యూనిస్కో గుర్తింపులో మా పాత్ర లేదని ఎలా చెబుతారని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. బీజేపీ నేతలు బాధ్యతగా మాట్లాడటం నేర్చుకోవాలని వారికి సలహా ఇచ్చారు. గొర్రెల పథకంపై బండి సంజయ్ వ్యాఖ్యలు ఖండిస్తున్నామని స్పష్టం చేశారు.