మళ్లీ రైతుబంధు నిలిపివేత

అసెంబ్లీ ఎన్నికల వేళ రైతు బంధు సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఈసీ ఉపసంహరించుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 28లోపు రైతు బంధు పంపిణీ చేసేందుకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవటంతో రైతు ఖాతాల్లో జమకావాల్సిన రైతు బంధు నిధులు నిలిచిపోనున్నాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు అనుమతి ఉపసంహరిస్తున్నట్లు ఈసీ ప్రకటనలో తెలిపింది. ఈనెల 28 నుంచి రైతుబంధు పంపిణీ చేస్తామన్న మంత్రి హరీశ్ రావు ప్రకటనను ఈసీ ప్రస్తావించింది. 28వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం 70 లక్షల రైతుల ఖాతాల్లో సుమారు 7 వేల కోట్ల రూపాయలు రైతుబంధు నిధులు వేసేందుకు సిద్ధమైంది. ఈసీ తాజా నిర్ణయంతో రైతు బంధు నిధుల విడుదలకు బ్రేక్ పడనుంది.
రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు కింద రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.10,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన నిధులు జమ చేసినప్పటికీ.. యాసంగి సీజన్ కోసం రెండో విడత నిధులు నవంబర్‌లోనే రైతులకు అందించాల్సి ఉంది. అయితే, ఎన్నికల కోడ్ రావడంతో కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఎన్నికల ముందు రైతుబంధు నగదు పంపిణీకి అనుమతి ఇవ్వకూడదని, అది ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలంగాణ కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే అది ఆపేశారు. కానీ, రెండు రోజుల కిందట ఈ నెల 28 వరకు రైతుబంధు పంపిణీ చేసుకోవచ్చని చెప్పిన ఈసీ తిరిగి దానిని నిలిపివేసింది.