ఛత్తీస్‌ఘడ్‌లో మరో ఎన్‌కౌంటర్
మావోయస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో బహెకర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ లో కీలక మావోయిస్టు నేత మృతి చెందాడు. సోమవారం ఉదయం డీఆర్ జీ జవాన్లు అటవీ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. నక్సలైట్లు జవాన్లపై కాల్పులు జరిపారు. దీనికి ప్రతిగా జవాన్లు కూడా కాల్పులు ప్రారంభించారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో సాకేత్ నరేటి మరణించినట్లు నారాయణపూర్ ఎస్పీ గిర్జా శంకర్ జైస్వాల్ వెల్లడించారు. ఒక AK-47 ను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు పార్టీకి చెందిన నంబర్ 6లోని సెక్షన్ 1కి సాకేత్ నరేటి కమాండర్‌గా ఉన్నారు. అతడిపై పోలీసులు లక్ష రూపాయల రివార్డు ప్రకటించారు. గడ్చిరోలి ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌లో భారీ నష్టాల తరువాత, నక్సలైట్ డిటాచ్‌మెంట్ వివిధ ప్రాంతాలుగా విభజించారు. కంకేర్ , గడ్చిరోలిని ఆనుకుని ఉన్న సరిహద్దు ప్రాంతాలలో సెర్చ్ ఆపరేషన్‌ను ముమ్మరం చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.