హుటాహుటిన ఢిల్లీకి రేవంత్‌రెడ్డి

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. అధిష్ఠానం పిలుపు మేరకు ఆయన కాసేపటి కిందటే గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లా నుంచి ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. అధిష్ఠానం నుంచి స్పష్టమైన హామీ రావడంతోనే రేవంత్ ఢిల్లీ బయలు దేరి వెళ్లినట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన అధిష్టానం పెద్దలను కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి విషయంతో సహా పలు అంశాలపై చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డిని ఢిల్లీకి ఆహ్వానించడంతో ఉత్కంఠ నెలకొంది. కాగా, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో డీకే శివకుమార్, మాణిక్యం ఠాకూర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం ముగిసింది. రాష్ట్రంలోని పరిస్థితుల గురించి ఢిల్లీ పెద్దలకు వారు వివరించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఎంపిక జరుగుతున్న నేపథ్యంలో ఆయనను ఢిల్లీకి పిలిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి, మంత్రి వర్గ తదితర అంశాలపై ఆయనతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.