పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలి

Ramagundam Police Commissionerate:మతసామరస్యం. సోదర భావంతో పండుగల జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ అన్నారు. మంగళవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపెల్లి, మంచిర్యాలలోని అన్ని వర్గాల మత పెద్దలతో గణేష్ చతుర్థి, మిలాద్-ఉన్-నబీ దృష్ట్యా శాంతి సంక్షేమ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి పండుగ ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని అన్ని మతాల పెద్దలతో పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. గత సంవత్సరం రామగుండం కమిషనరేట్ పరిధిలో 4253 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సంవత్సరం వినాయక విగ్రహాల ఏర్పాటు పెరిగే అవకాశం ఉందన్నారు. వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకునే నిర్వహకులు అన్ని వివరాలతో పోలీస్ స్టేషన్లో సంప్రదించి తప్పని సరి అనుమతి తీసుకోవాలన్నారు. గణేష్ మండపాల వద్ద నిర్మాణ కమిటీలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, విద్యుత్ షార్ట్ సర్క్యూట్, అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
కొంతమంది సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు పుకార్లు ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు పెట్టే అవకాశం ఉందని ప్రజలు వాటి పోస్టులను చూసి సంయమనం పాటించాలన్నారు. అది నిజామా…? అబద్దమా..? అని పోలీసులను అడిగి తెలుకోవాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే డయల్ 100, కమీషనరేట్ కంట్రోల్ రూం 8712656597 కానీ స్థానిక పోలీసులను సంప్రదించాలని సూచించారు. సోషల్ మీడియా లో అసత్య ప్రచారాలు చేసి మత ఘర్షణలు జరిగేలా లా అండ్ ఆర్డర్ సమస్యకు కారణం అయితే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, నిరంతరం నిఘా ఉంచి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీసీపీలు చేతన, భాస్కర్, రాజు, ఏసీపీలు రాఘవేంద్రరావు, రమేష్, కృష్ణ, ప్రకాష్. వెంకటేశ్వర్లు, రవికుమార్, మల్లారెడ్డి, నరసింహులు, వెంకటస్వామి, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.