బాల్క సుమన్‌తో పాటు మహిళపై దుష్ప్రచారం చేసిన వ్యక్తుల అరెస్టు
ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌కు కమలాపూర్ ప్రాంతానికి చెందిన మహిళతో చనువుగా ఉన్నాడని వాట్సప్‌లో దుష్ప్రచారం చేసిన నలుగురు యువకులను బుధవారం కమలాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. వీరివద్ద నుంచి నాలుగు సెల్‌ఫోన్లు సైతం స్వాధీనం చేసుకున్నారు. కాగా వీరు బీజేపీ కార్యకర్తలని పోలీసులు వెల్లడించారు.
గత నెల హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ ఎస్ పార్టీ కార్యాలయాన్ని బైరి దశరథం అనే వ్యక్తి తన ఇంటిని అద్దెకు ఇచ్చారు. ఇది సహించలేని ప్రత్యర్థి పార్టీకి చెందిన కార్యకర్తలు దశరథంపై కక్ష పెంచుకున్నారు. పార్టీ ప్రచారం నిమిత్తం కార్యాలయానికి వస్తూ పోతూ ఉన్న ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌కు దశరథ్ ఇంటి సభ్యుల మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లుగా సందీప్ ఠాకూర్ అనే వ్యక్తి ఒక వీడియోను రూపొందించి దానిని షేర్ చేశారు. బండి సదానందం, వడ్డె రమేష్, వసంతరావు, కడారి వెంకటేష్, సునీల్ గౌడ్, లక్ష్మీ వీరమల్లు వీటిని షేర్ చేశారు. హుజురాబాద్‌తో పాటు హన్మకొండ జిల్లాలకు చెందిన పలు వాట్సప్ గ్రూపుల ద్వారా ఇది వైరల్ గా మారింది. దీనిని గమనించిన దశరథం తమపై జరుగుతున్న దుష్ప్రచారం చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని కమలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆ మహిళతో పాటు ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌పై దుష్ప్రచారానికి పాల్పడ్డ ఏడుగురు నిందితులను గుర్తించారు. ఇందులో బండి సదానందం, వడ్డె రమేష్, వసంతరావు, కడారి వెంకటేష్‌లను పోలీసులు అరెస్టు చేశారు. మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు. ఈ సందర్భంగా వరంగల్ నగర పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి మాట్లాడుతూ ఎవరైనా వ్యక్తులు కానీ, ప్రజల వ్యక్తిగత గౌరవాన్ని కించపరిచే విధంగా సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.