టీబీజీకేఎస్‌లో మూడు ముక్కలాట..
గ్రూపులుగా యూనియన్ నేతలు - వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టమేనంటున్న గులాబీ శ్రేణులు

సింగరేణిలో టీఆర్ఎస్ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గ్రూపులతో సతమతం అవుతోంది. ఏ ముహూర్తాన ఆ యూనియన్ ప్రారంభం అయ్యిందో కానీ అప్పటి నుంచి అదే పరిస్థితి. ఇప్పుడు పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. పెద్ద నేతలు బయట పడకుండా యూనియన్‌లో తమ పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తుంటే ఏరియా వారీగా ద్వితీయ శ్రేణి నాయకత్వం గ్రూపుల్‌గా విడిపోయి టగ్ ఆఫ్ వార్ ఆడుతున్నారు. అన్ని ఏరియాల్లో ఇదే పరిస్థితి ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
సింగరేణిలో వర్గపోరు పెద్ద ఎత్తున కొనసాగుతోంది. బయటకు కనిపించకపోయినా నివురుగప్పిలా గ్రూపులు కొనసాగుతున్నాయి. గతంలో నిర్వహించిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లోనే ఆ యూనియన్ ఓడిపోయే పరిస్థితి. ముఖ్యమంత్రి నివేదిక ప్రకారం కేవలం రెండు ఏరియాల్లో మాత్రమే గెలవాల్సి ఉండే. కానీ డబ్బు, మద్యం పుణ్యమా అని ఆ యూనియన్ గట్టెక్కింది. అంతేకాకుండా ప్రజాప్రతినిధులు ముఖ్యంగా విప్ బాల్క సుమన్ శ్రీరాంపూర్ డివిజన్‌లో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. లేకపోతే సింగరేణి వ్యాప్తంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గుర్తింపు వచ్చేదే కాదు. మొదటి నుంచి కొనసాగుతున్న ఈ గ్రూపు రాజకీయాలు ఇప్పటికి ఆ యూనియన్‌ను వీడటం లేదు.
ముచ్చటగా మూడు గ్రూపులు..
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంలో ముచ్చటగా మూడు గ్రూపులు కొనసాగుతున్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేసిన కెంగర్ల మల్లయ్య, అధ్యక్షుడు వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ఇలా మూడు వర్గాలుగా కొనసాగుతున్నాయి. ప్రతి ఏరియాలో తమ వర్గం ఉండాలనే నేతల తాపత్రయంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది. వెంకట్రావ్ మొదట్లలో ఐఎన్‌టీయూసీలో ఉండేవారు. ఆయన యూనియన్ మారినప్పుడు తన వారిని అందరినీ వెంట తీసుకువచ్చారు. తనతో వచ్చిన వారందరికీ పదవులు ఇప్పించాలనే సంకల్పంతో పాత వారికి ఇబ్బందులు తప్పలేదు. దీంతో మొదటి నుంచి తమకు పదవులు కాదని మధ్యలో వచ్చిన వారికి ఎలా ఇస్తారంటూ ఏరియాల వారీగా గొడవలు జరిగాయి…. జరుగుతున్నాయి కూడా….
బెల్లంపల్లి ఏరియా..
ఇక్కడ చర్చల కమిటీ ప్రతినిధి ధరావత్ మంగీలాల్‌కు, బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్‌కు అస్సలు పొసగదు. బయటకు ఇద్దరూ కలిసి వేదికలు పంచుకున్నా వాస్తవానికి వస్తే మాత్రం ఇద్దరూ దూరం.. దూరం.. మాదారం టౌన్షిప్‌లో ఉన్న టీబీజీకేఎస్ కార్యాలయానికి మంగీలాల్ వస్తున్నాడని ఒకే ఒక కారణంతో ఆ కార్యాలయం కాదని, శ్రీనివాస్ వర్గం వేరే కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. ఇలా చాలా సందర్భాల్లో ఇద్దరి మధ్య వర్గపోరు బయటకు కనిపిస్తోంది.
మందమర్రి ఏరియా…
ఇక మందమర్రి ఏరియాలో మేడిపల్లి సంపత్ రాజిరెడ్డి వర్గం కాగా, ఐఎన్‌టీయూసీ వచ్చిన సూర్యనారాయణ వెంకట్రావ్ వర్గంగా కొనసాగుతున్నారు. మిగతా నేతలంతా ఆయా వర్గాల్లో ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అందరినీ పిలిచి వార్నింగ్ ఇచ్చారు. బయటికి వీరంతా సైలెంట్‌గా కనిపిస్తున్నా లోపల మాత్రం వర్గపోరు సాగిస్తున్నారు. గతంలో యూనియన్ లో ఉన్న తగాదాల వల్ల ఇక్కడ ఓటమి పాలయ్యారు.
శ్రీరాంపూర్ ఏరియా..
శ్రీరాంపూర్ ఏరియాలో యూనియన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇక్కడ డివిజన్ కమిటీ, సెంట్రల్ కమిటీ పేరుతో నేతలు వేర్వేరు కుంపట్లు పెట్టుకున్నారు. ఏరియా ఉపాధ్యక్షుడు సురేందర్ రెడ్డి రాజిరెడ్డి వర్గం కాగా, అన్నయ్య, మల్లారెడ్డి వెంకట్రావ్ వర్గంగా సాగుతున్నారు. చాలా సందర్భాల్లో బహిరంగంగానే వీరు గొడవలు పడ్డారు. గత ఎన్నికల్లో ఇక్కడ కూడా యూనియన్ ఓటమి పాలయ్యేది. చివరగా రంగంలోకి దిగిన విప్ బాల్క సుమన్ యూనియన్‌ను ఓటమి నుంచి గట్టెక్కించారు.
ఆర్జీ 1 ఏరియా..
ఇక రామగుండం 1 ఏరియాలో గ్రూపు తగాదాలకు పెట్టింది పేరుగా సాగుతోంది. అగ్రనేతలు ఇక్కడే ఉండటంతో నిత్యం ఇక్కడ తన్నులాటలే. దామోదర్‌రావు వెంకట్రావ్ వర్గం కాగా, పెంచాల తిరుపతి, వడ్డేపల్లి శంకర్, శ్యాంసన్ రాజిరెడ్డి వర్గంగా సాగుతున్నారు. కొద్ది రోజుల కిందట సాక్షాత్తు జీఎం కార్యాలయంలోనే దామోదర్‌రావును కొట్టారు. ఈ గొడవలో తిరుపతి, మరొకరిని సస్పెండ్ చేశారు. ఈ విషయంలో రాజిరెడ్డి దగ్గర ఉండి మరీ తమ నేతను కొట్టించారని ఎదుటి వర్గం ఆరోపణలు గుప్పించింది.
ఆర్జీ 2 ఏరియా…
రామగుండం 2 ఏరియాలో సైతం ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఐలు శ్రీను ఒక వర్గంగా, సత్యనారాయరెడ్డిది మరో వర్గంగా సాగుతోంది. దీంతో వీరి మధ్య పోటాపోటీగా సాగుతోంది. తమ నేతల అండతో కింది స్థాయి కార్యకర్తలు కూడా అదే విధంగా ముందుకు నడుస్తున్నారు.
ఆర్జీ 3 ఏరియా…
ఇక్కడ సాంబయ్య ఉపాధ్యక్షుడు సాంబయ్య వెంకట్రావ్ వర్గం కాగా, ఆయనతో పాటు గౌతమ్, శంకరయ్య, శంకర్‌నాయక్ కొనసాగుతున్నారు. ఇక పింగళి సంపత్‌రెడ్డి రాజిరెడ్డి వర్గంగా సాగుతున్నారు. ఇక కూడా యూనియన్ పరిస్థితి ఏమంత బాలేదు.
భూపాలపల్లి ఏరియా..
ఈ ఏరియాలో గ్రూపుల మధ్య గొడవలు అనేకంటే యుద్ధం అంటే సరిపోతుంది. ఇక్కడ యూనియన్లో చాలా తీవ్ర స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. కొక్కుల తిరుపతి వెంకట్రాఇవ్ వర్గానికి చెందిన వారు కాగా, బడితెల సమ్మయ్య, ఏబూసి ఆగయ్య ప్రత్యర్థి వర్గంలో కొనసాగుతున్నారు. ఇక్కడ ప్రతి పనిని ఒకరు సమర్థిస్తే ఇంకో వర్గం వ్యతిరేకిస్తుంది. ఈ రెండు వర్గాలకు ప్రజాప్రతినిధులు సైతం మద్దతు చెబుతుండటంతో ఎవరూ వెనక్కి తగ్గరు.
ఇల్లందు ఏరియా…
ఇక్కడ కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక్కడ రంగనాథ్ వెంకట్రావ్ వర్గంగా ఉన్నారు. గతంలో పనిచేసిన గడ్డం వెంకటేశ్వర్లు రాజిరెడ్డి వర్గంగా కొనసాగేవారు. ఆయనకు సంబంధించి ఒక మహిళ వ్యవహారంలో బయటకు పంపించారు. ఇక ఇక్కడ జంగం కేశవులుకు వైస్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదు. దీంతో నివురుగప్పిన నిప్పులా ఉంది పరిస్థితి.
ఇలా రెండు వర్గాల మధ్య పోరు కొనసాగుతుండగా, కొన్ని చోట్ల కెంగర్ల మల్లయ్య వర్గం ప్రత్యేకంగా ఉంది. తమ నేత సైలెంట్‌గా ఉండటంతో వారు కూడా ప్రస్తుతానికి నిశ్శబ్దంగా ఉన్నారు. అధిష్టానం జోక్యం ఇప్పటికైనా ఈ గ్రూపుల గొడవ తగ్గించకపోతే వచ్చే ఎన్నికల్లో తమ యూనియన్‌కు ఓటమి ఖాయమని పలువురు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.