4,656 గణేష్ విగ్రహాల ఏర్పాటు

-గ‌ణేశ్‌ మండపాలకు జియో ట్యాగింగ్‌ ద్వారా భద్రత
-రామ‌గుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్

గణేష్‌ ఉత్సవాలను, నిమజ్జన శోభ యాత్ర సంద‌ర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తూ చర్యలలో అన్ని వినాయక మండపాలకు జియో ట్యాగింగ్ చేసిన‌ట్లు రామ‌గుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ వెల్ల‌డించారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 2,405 మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 2,251 మొత్తం 4,656 విగ్రహాలు ఏర్పాటు చేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. పోలీ‌స్‌ స్టేషన్‌ పరిధిలో పెట్రోలింగ్‌ నిర్వహించే బ్లూకోర్ట్స్‌ సిబ్బంది గణేశ్‌ మండపాలను క్షేత్రస్థాయిలో సందర్శించి వినాయక మండపాల వివరాలను జియో ట్యాగింగ్‌కు అనుసంధానం చేసిన‌ట్లు చెప్పారు. నిమజ్జనం ఏరోజు, ఎక్కడ చేస్తారనే వివరాలు, నిమజ్జన సమయం, రూట్ తో పాటు భద్రతా చర్యలపై పర్యవేక్షణ ఉంటుంద‌న్నారు.

మండపాలకు సంబంధిత పోలీస్ స్టేషన్లో ఉన్న బ్లూ కోల్ట్స్, ప్యాట్రో కార్ డేటాను పోలీస్ యాప్ తో కనెక్ట్ చేశారని వెల్ల‌డించారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తినా, మండపాల వద్ద ఎలాంటి సమస్య తలెత్తినా మండపం ఏర్పాటు చేసిన ప్రాంతం తెలుస్తుందని, క్షణాల్లో చేరుకునేందుకు అవకాశం ఉంటుంది అని సిపి తెలిపారు. మండ‌పాల వ‌ద్ద‌ భక్తికి సంబంధించిన పాటలే ఉండాలి తప్ప ఇతర మతాల వారిని, ఇతర వ్యక్తులను ఇబ్బంది పెట్టే విధంగా, కించపరిచే విధంగా ఉండోద‌ని స్ప‌ష్టం చేశారు. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే విధంగా ఎలాంటి గొడవలు జరిగిన చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే తక్షణమే పోలీసు వారికి సమాచారం అందించాలని సూచించారు. నిమజ్జనం రోజు తీసుకోవాల్సిన నిబంధనలు, ఆంక్షలు పాటించాలని, ఏలాంటి గొడవలు, అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా శాంతియుత వాతావరణంలో శోభయాత్ర సాగేలా పోలీసులకు సహకరించాలని కోరారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like