ఆడపిల్ల పుడితే రూ.10 వేలు : సర్పంచ్ బంపరాఫర్
ఆడపిల్ల అంటే అబార్షన్లు, పుడితే చంపేయడం ఇప్పుడున్న పరిస్థితిలో మహిళలపై వివక్ష అలాగే కొనసాగుతోంది. కానీ ఆడపిల్ల అంటే అదృష్టమని ఇంటి మహాలక్ష్మి అని కొందరు గుర్తిస్తున్నారు. ఆ కోవకే చెందుతారు వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మరియపురం సర్పంచ్ అల్లం బాలిరెడ్డి.
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మరియపురంలో ఆడపిల్ల పుడితే రూ.10వేల కానుక ఇస్తామని గ్రామ సర్పంచ్, నిర్మల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అల్లం బాలిరెడ్డి ప్రకటించారు. పంచాయతీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సుకన్య సమృద్ధి యోజన కింద ఆడబిడ్డ పేరిట బ్యాంకులో ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయనున్నట్లు వెల్లడించారు. తాను పదవి చేపట్టిన నాటి నుంచి గ్రామంలో 8 మంది ఆడపిల్లలు జన్మించారని, వారందరి పేరిట డబ్బు డిపాజిట్ చేయనున్నట్లు తెలిపారు. తాను సర్పంచ్ పదవిలో ఉన్నంత కాలం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తానన్నారు. ఈ నెల 20న నిర్మల ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 8 మంది బాలికల తల్లిదండ్రులకు డిపాజిట్ పత్రాలు అందజేస్తామన్నారు.
ఇలాంటి సర్పంచ్లు ఉంటే చిన్నారి తల్లులు కిలకిలా నవ్వుతూ తిరుగుతారు కదా..