ప్రభుత్వానికి షాకిచ్చేందుకు ఎంపీటీసీలు సిద్ధం
స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఎత్తున నామినేషన్లు వేసేందుకు ప్లాన్ - ఇప్పటికే కరీంనగర్‌లో నామినేషన్ వేసిన ఎంపీటీసీ - తమను ఉత్సవ విగ్రహాలుగా మర్చారాని ఆవేదన
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి షాక్ ఇచ్చేందుకు ఎంపీటీసీలు సిద్ధం అవుతున్నారు. రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన తమను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని తాము ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వార్డు సభ్యులకు ఉన్న గౌరవం కూడా మాకు లేదు.. అసలు మేం గెలిచి ఏం ప్రయోజనమో అర్దం కావడం లేదు. ప్రజలకు సేవ చేయాలని ఏం చేయలేక నిస్సహాయంగా మిగిలిపోతున్నాం… ఇదీ రాష్ట్రంలో గెలిచిన ఎంపీటీసీ సభ్యుల ఆవేదన. వారు గెలిచినప్పటి నుంచి నిధులు, విధులు, అధికారులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎంపీటీసీలు ఎన్నికైన నాటి నుంచి నిధులు కేటాయించకపోవడంతో కేవలం ఉత్సవ విగ్రహాలుగా మారారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 14, 15వ ఆర్థిక సంఘం నిధులు జిల్లా, మండల పరిషత్ సభ్యుల ప్రమేయం లేకుండా నేరుగా గ్రామాలకు అందచేశారు. దీంతో ఎంపీటీసీలు ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి. ప్రతి గ్రామపంచాయతీలో ఎంపీటీసీలు కూర్చునేందుకు ఛాంబర్ ఏర్పాటు చేయాలని కోరారు.
33 డిమాండ్లలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు..
73వ రాజ్యాంగ సవరణ చట్టం ఆర్టికల్ 243జీ 11వ షెడ్యూల్ ప్రకారం తమకు నిధులు, విధులు, అధికారాలు బదలాయించాలని ఎంపీటీసీలు డిమాండ్ చేశారు. ప్రతి ఎంపీటీసీకి ఏటా రూ.20లక్షల నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్, అగ్రికల్చర్, మార్కెటింగ్, మండల ల్యాండ్ అసైన్‌మెంట్ కమిటీలు, జిల్లా ప్రణాళికా సంఘాల్లో ఎంపీటీసీలను సభ్యులుగా నియమించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పింఛన్ దరఖాస్తులపై ఎంపీటీసీలకు సంతకం చేసే అధికారం కల్పించాలని ఇలా 33 రకాల డిమాండ్లతో ప్రభుత్వానికి ఎన్నో సార్లు వినతులు సమర్పించారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును పలు మార్లు కలిశారు. అయినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.
ఇక షాక్ ఇచ్చేందుకు సిద్ధం..
ప్రభుత్వం వినకపోవడంతో ప్రభుత్వానికి షాక్ ఇచ్చేందుకు ఎంపీటీసీలు సిద్ధం అవుతున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల కావడంతో ఇదే సరైన సమయమని భావిస్తున్నారు. ఈ మేరకు వారు పోటీలో నిలబడేందుకు ప్రణాళికలు రూపొందించుకుటున్నారు. ఎన్నిమార్లు ప్రభుత్వం వినకపోవడంతో ఇదే అదను అని ఎంపీటీసీలు నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు ఇప్పటికే కరీంనగర్ జిల్లా చొప్పదండి వైస్ ఎంపీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న భూపాలపట్నం ఎంపీటీసీ మునిగాల విజయలక్ష్మీ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ ఎన్నికల్లో గెలిచి ఎంపీటీసీల తరఫున తన గళం వినిపిస్తానని ఆమె స్పష్టం చేశారు. ఇలా అన్ని చోట్ల ఎంపీటీసీలు బరిలో దిగేందుకు సిద్ధం అవుతున్నారు.
ఇప్పటికే హుజూరాబాద్ షాక్‌లో ఉన్న ప్రభుత్వానికి ఇది పెద్ద సవాల్‌గా మారనుంది. మరి నిధులు, విధులు, అధికారులు కేటాయిస్తామని ఎంపీటీసీలను బుజ్జగిస్తుందా..? ఎంపీటీసీల పోరు కొనసాగుతుందా…? వేచి చూడాల్సిందే.