అందుకే దాడి..

గంజాయి, గుండాయిజం కట్టడి చేస్తున్నందుకు నా ఇంటిపై దాడి చేశారని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆరోపించారు. తన ఇంటిపై దాడి చేసి వాచ్ మెన్ పై భౌతిక దాడి చేసినంత మాత్రాన ఎవరికి భయపడేది లేదని అన్నారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 14న రాత్రి తన ఇంట్లోకి ముగ్గురు ముసుగులు ధరించిన దుండగులు చొరబడి వాచ్ మెన్ ను కొట్టారని తెలిపారు. తనను భయపెట్టడానికి దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇంటపై దాడి చేసిన నిందితుల ఆచూకీ కోసం గాలింపు జరుగుతోందన్నారు. మంచిర్యాలలో గంజాయి, గుండాయిజాన్ని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తుండడం అక్రమార్కులకు గిట్టడం లేదన్నారు. గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు, ఆయన తనయుడు విజిత్ రావు అండతో చెలరేగిపోయిన వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారన్నారు. బీజేపీ, బీఆరెస్ పార్టీలో హంతకులు, గుండాలను ఎలా ప్రోత్సహిస్తారని ప్రశ్నించారు. గంజాయి ఎక్కడి నుంచి వస్తోంది ఎవరు తెస్తున్నారు, అమ్మేది ఎవరో కారకులు ఎవరో అందరికి తెలుసునని చెప్పారు. విజిత్ రావు సహకారంతోనే గంజాయి వచ్చిందని యువకుల జీవితాలను నాశనం చేశారని ఆరోపించారు. తన పాలనలో సామాన్యులకు ఏ అన్యాయం జరగదని భరోసా ఇచ్చారు. కూరగాయల మార్కెట్, గంగారెడ్డి రోడ్ డీఎఫ్ఓ కార్యాలయం, వెంకటేశ్వర టాకీస్ రోడ్ లలో రోడ్ విస్తరణ చేస్తున్నానని అందరూ సహకరిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గ ములో రోడ్లు, వంతెన నిర్మాణంకు 15 కోట్లు మంజూరు అయినట్లు తెలిపారు. మీడియా మిత్రులు అభివృద్ధి, సంక్షేమానికి సహకరించాలని ఒకవేళ సహకరించకపోయినా అభివృద్ధి ఆగదన్నారు. మాత, శిశు ఆసుపత్రి నిర్మాణం విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.