గుస్సాడీ కనకరాజు ఇక లేరు..
Padma Shri Kanaka Raju:పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు కన్నుమూశారు. అనారోగ్యంతో తన స్వగ్రామం మార్లవాయిలో ఆయన మరణించారు. గుస్సాడీ నృత్యమంటే ఎంతో ప్రాణమిచ్చే ఆయన చివరి వరకు ఆ కళ కోసం ఎంతో కృషి చేశారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలంటే ప్రాణమిచ్చే కనకరాజు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మార్లవాయిలో 1938లో జన్మించారు. కనకరాజుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య పార్వతి, రెండో భార్య పేరు భీంబాయి. ఈ దంపతులకు 12 మంది సంతానం. వీరిలో 8 మంది ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు. కనకరాజుకు గుస్సాడీ నృత్యాలు అంటే ఎంతో ఇష్టం. గుస్సాడీ నృత్యాన్ని నేర్చుకోవడంతో పాటు తన తర్వాత సైతం చాలా మందికి నేర్పించాడు. 1982లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎదుట ఢిల్లీలో మొదటిసారి ప్రదర్శన ఇచ్చే అవకావం కలిగింది. ఎర్రకోట వద్ద సైతం గుస్సాడీ నృత్య ప్రదర్శన ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇందిరా గాంధీ చేతులమీదుగా ప్రశంసాపత్రాలతో పాటు బహుమతి కూడా అందుకున్నారు. ఇందిరా గాంధీకి తన గుస్సాడీ టోపీని బహుమతిగా ఇచ్చారు. అప్పటి నుంచి ఏటా ఎంతోమంది యువకులకు గుస్సాడీ శిక్షణ ఇచ్చేవారు. దీంతో ఆయన ప్రభుత్వ దృష్టిని ఆకర్షించారు. మార్లవాయితో పాటు చుట్టుపక్కల మండలాల్లో ఏ కార్యక్రమం ఉన్నా సరే కనకరాజు గుస్సాడీ నృత్యం ఉండాల్సిందే.