బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రి పునఃప్రారంభించండి
లేకపోతే ఆందోళన చేస్తాం : ఐఎన్టీయూసీ నేతల హెచ్చరిక
బెల్లంపల్లి : సింగరేణి కార్మికుల కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి కట్టిన బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రి వారికే ఉపయోగపడకుండా పోతోందని ఐఎన్టీయూసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిని పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ శౌరికి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా వారు సీనియర్ ఉపాధ్యక్షుడు సిద్ధంశెట్టి రాజమౌళి మాట్లాడుతూ కార్మికులకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్న ఏరియా ఆసుపత్రిని కరోనా సమయంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నారు. ఇప్పుడు పాత జీఎం కార్యాలయంలో మొక్కుబడిగా ఆసుపత్రి నిర్వహిస్తున్నారని చెప్పారు. చిన్న చిన్న కారణాలకు కూడా కార్మికులు, వారి కుటుంబ సభ్యులను వేరే ఏరియాలకు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గోలేటీ నుంచి బెల్లంపల్లి ఆసుపత్రికి రావడానికే 35 కిలోమీటర్లు ఉంటుందన్నారు. ఇక్కడికి వచ్చాక గోదావరిఖని పంపిస్తున్నారని వెల్లడించారు. దీంతో ఇక్కడికి రావాలంటేనే కార్మికులు భయపడుతున్నారని అన్నారు. ఇక పరీక్షలు నిర్వహించాలన్నా సరైన వసతులు లేవని ప్రైవేటు ఆసుపత్రులకు పంపిస్తున్నారని అన్నారు. అంతేకాకుండా మందులు కూడా సరిగా ఇవ్వడం లేదన్నారు. కార్మికుల తరఫున ఐఎన్టీయూసీ పోరాటం చేసేందుకు నిర్ణయం తీసుకుందన్నారు. పది రోజుల్లో ఆసుపత్రిని పునః ప్రారంభించి కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు సరైన వైద్యం అందించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం. సూరిబాబు, బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు పేరం శ్రీనివాస్, మందమర్రి ఏరియా కార్యదర్శి కే. ఓదెలు, బెల్లంపల్లి ఏరియా కార్యదర్శి మాధవ కృష్ణ, పిట్ సెక్రటరీలు అనంత్‌కుమార్, కోటేశ్వర్రావు, బెల్లంపల్లి ఏరియా నాయకులు గెల్లి జయరాం, పార్వతి సత్తయ్య, యువజన కాంగ్రెస్ నాయకులు పుట్ట శ్రీనివాస్, దేవ రమేష్, చరణ్‌లాల్, జైపాల్, జీవరత్నం తదితరులు పాల్గొన్నారు.