మంచిర్యాల జిల్లాలో టెన్షన్.. టెన్షన్..
Lady Aghori: మంచిర్యాల జిల్లాలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. మహిళా అఘోరీ తాను శుక్రవారం ఆత్మార్పణ చేసుకుంటానని ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు ఆమెను గృహ నిర్బంధంలో ఉంచారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కృశ్నపల్లి గ్రామంలో రెండవ రోజు సైతం ఆమె పోలీసుల నిర్బంధంలోనే ఉన్నారు. ముత్యాలమ్మ గుడి వద్ద ఆత్మార్పణం చేసుకుంటానని ఆమె ప్రకటించిన నేపథ్యంలో ఇంట్లో నుంచి బయటకు రాకుండా పోలీసుల భద్రత ఏర్పాటు చేశారు. కొన్ని రోజులుగా తెలంగాణలో మహిళా అఘోరీ నాగసాధువు విషయం హాట్ టాపిక్ గా మారింది. గత నెల 29న మహిళా అఘోరీ సంచలన ప్రకటన చేశారు. నవంబర్ 1 శుక్రవారం ఉదయం 9గంటలకు ముత్యాలమ్మ ఆలయం దగ్గర లోక కల్యాణంకోసం ఆత్మార్పణ చేసుకుంటానని ప్రకటించారు.
ఈ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆమెను సొంత గ్రామమైన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుశ్నపల్లికి భారీ భద్రత మధ్య తరలించారు. ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. కుశ్నపల్లిలో భారీగా పోలీసులను మోహరించారు. గ్రామంలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. కుశ్నపల్లి గ్రామానికి ఎవరూ రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. భక్తులు తరలిరావడం ఆందోళన నేపథ్యంలో అఘోరి ఆత్మార్పణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని భక్తులు చెబుతున్నారు. అయితే అఘోరీ మాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించకపోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.