ఎమ్మెల్సీ అభ్యర్థిగా దండే విఠల్
తెరపైకి కొత్త పేరు తెచ్చిన అధినేత - మైం హోం రామేశ్వర్‌రావుకు ఆప్తుడు - ఉద్యమకారుడు.. సామాజిక నేపథ్యం... ఆర్థికంగా బలవంతుడు - అందుకే ఎంపిక చేసిన ముఖ్యమంత్రి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ పెద్ద ఝలక్ ఇచ్చారు. అభ్యర్థుల్లో రేసులో ఉన్నారని భావిస్తున్న వారిలో ఎవరికీ టిక్కెట్టు దక్కలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీగా అభ్యర్థిగా కొత్త వ్యక్తి పేరు తెరపైకి తీసుకువచ్చారు. తెలంగాణ ఉద్యమ కారుడు, ఎన్ ఆర్ ఐ దండే విఠల్ కు టిక్కెట్టు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. గతంలో సనత్‌నగర్ ఎన్నికల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ మీద ఓటమి పాలయ్యారు. మొదటి నుంచి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు. అమెరికాలో పలు వ్యాపారాలు ఉన్నాయి. సనత్‌నగర్‌కు తలసాని శ్రీనివాస్ యాదవ్ రావడంతో పార్టీలో ఆయనకు ప్రాధాన్యత తగ్గింది. అయినా పార్టీని నమ్ముకుని ఉన్నారు. కేటీఆర్ వెంట ఉండి పార్టీ కోసం శ్రమిస్తున్న నేతగా ఆయనకు గుర్తింపు ఉంది.
సిర్పూరు ప్రాంతానికి చెందిన వాడు..
విఠల్ సిర్పూరు కాగజ్‌నగర్ ప్రాంతానికి చెందిన వాడు. కాగజ్‌నగర్‌లో కాపువాడకు చెందిన వ్యక్తి. మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన వారు. ఇక్కడే ఇంటర్ వరకు చదువుకున్నారు. వ్యాపార రీత్యా అమెరికా వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అక్కడ ఉంటూనే చురుకైన పాత్ర పోషించారు. ఇక్కడకు వచ్చిన తర్వాత కూడా కేసీఆర్, మైం హోం రామేశ్వర్‌రావు, కేటీఆర్‌కు సన్నిహితులుగా మారారు. ఉద్యమకారుడు, సామాజిక నేపథ్యం, ఆర్థికంగా బలంగా ఉండటం అన్ని రకాలుగా ఆయనకు కలిసివచ్చాయి.