ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం
Palabhishekam for Chief Minister’s picture: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి దిలావర్‌పూర్ రైతులు గురువారం పాలాభిషేకం నిర్వహించారు. బుధవారం వరకు రైతులు ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. రైతుల పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం, పరిశ్రమ పనులు నిలిపివేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆందోళనలు విరమించిన అన్నదాతలు ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో నూతనంగా నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలని కొన్ని నెలలుగా స్థానిక ప్రజలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే తమ పంట పొలాలతోపాటు పాటు అక్కడి పర్యావరణం సైతం దెబ్బతింటుందని గ్రామస్థులు వాపోయారు. ఈ నిరసనలో చిన్నారులు, వృద్ధులు మహిళలు సైతం పాల్గొన్నారు. ఎన్నో రోజులుగా పోరాటం సాగుతుండటంతో నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌కు నివేదిక ఇచ్చారు. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అనుమతులను పునః సమీక్షించాలని సర్కారు నిర్ణయించింది. ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని స్థానికంగా ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. అవసరమైతే పరిశ్రమ అనుమతులను రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. తాజాగా ప్రభుత్వ సూచనల మేరకు ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.