ఈ టీ పొడి ఖరీదు కిలో రూ.10 కోట్లు
అవును.. మీరు చదివింది నిజమే.. డా హాంగ్ పావొ టీపొడి ప్రస్తుత ధర అది.. భవిష్యత్ లో మరింత పెరిగే అవకాశం ఉందంట.. చైనాలోని వుయి పర్వతాల మీద పెరిగే డా హాంగ్ పావొ రకం టీ పొడి బంగారం కంటే ఎన్నో రెట్లు ఖరీదైంది తెలుసా.. ఈ తేయాకు ఒక్క గ్రాము రూ.లక్ష పైనే పలుకుతుంది పూర్వం స్థానిక చక్రవర్తి అనారోగ్యంతో బాధపడుతుంటే ఓ సన్యాసి ఈ తేయాకులతో టీ చేసి తాగించాడట. వెంటనే ఆయన కోలుకున్నాడట. అప్పట్నుంచీ దీన్ని సంజీవనిలా భావిస్తారు స్థానికులు. పర్వతం పై భాగంలోని ఔషధ మొక్కలను దాటుకుని సున్నపు రాతి కొండల మీదుగా ప్రవహించే నీరు ఈ టీ చెట్లకు ఎన్నో ఔషధ గుణాలను తెచ్చిపెడుతుంది. అందుకే, ఎంత నీరసంగా ఉన్నవారైనా డా హాంగ్ పావొ టీని తాగితే ఉత్సాహంగా లేచి తిరుగుతారట. ఈ టీలో ఉండే సుగుణాలు ఉబ్బసం, ఊబకాయం, కాళ్ల వాపుల్లాంటి సమస్యలనూ మద్యం, ధూమపానం వల్ల కలిగే దుష్ప్రభావాలనూ దూరం చేస్తాయి. అయితే, అత్యుత్తమమైన హాంగ్ పావొ తేయాకు వందల ఏళ్ల నుంచీ ఉన్న తల్లి చెట్ల నుంచే లభిస్తుంది. అలాంటివి ప్రస్తుతం కేవలం ఆరు చెట్లే ఉన్నాయట. మిగిలినవన్నీ ఆ చెట్ల నుంచి అంటు కట్టినవీ వాటి విత్తనాల నుంచీ పెంచినవే. అందుకే, తల్లి చెట్టు నుంచి తీసిన టీపొడి ఖరీదు చాలా ఎక్కువ. 20గ్రాముల ఈ పొడిని ఆమధ్య వేలంలో పెడితే, 20లక్షలకు అమ్ముడు పోయింది. అరుదుగా దొరుకుతుంది కాబట్టి దీన్ని చైనా జాతీయ సంపదగా కూడా ప్రకటించింది..