ప్రశాంతంగా గ్రూప్-2 పరీక్షలు
ఆసిఫాబాద్ జిల్లాలో గ్రూప్ 2 పరీక్ష కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ శ్రీనివాసరావు
SP Srinivasa Rao inspected Group2 Examination Centers: గ్రూప్-2 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఆయన జిల్లా కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల, సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని కేంద్రాల వద్ద పోలీసు భద్రత పటిష్టంగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 18 పరీక్ష కేంద్రాల వద్ద 163 బి.ఎన్.ఎస్.ఎస్ (144 సెక్షన్) అమలులో ఉన్నందున ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు అనుమతులు లేవన్నారు. ప్రజలు కూడా గుంపులు గుంపులుగా ఉండవద్దని స్పష్టం చేశారు. జవాబు పత్రాలు తరలింపులో కూడా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. ప్రశాంతంగా సజావుగా పరీక్షా నిర్వహణ జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఎస్పీ సూచించారు.