ఖాకీల‌ను బ‌లిగొంటున్న గుండెపోటు

-ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో ఏడాదిలో ఎనిమిది మంది వ‌ర‌కు మృత్యువాత
-అనారోగ్య కార‌ణాలా..? లేక ప‌ని ఒత్తిళ్లా..? అనే అనుమానాలు
హెల్త్ చెక‌ప్‌లు లేక ఇబ్బందులు ప‌డుతున్న ఖాకీలు
-ఆ వైపుగా దృష్టి సారించాలంటున్న పోలీసు కుటుంబాలు

The police have a heart attack: పోలీసు ఉద్యోగం అంటేనే నిత్యం స‌వాళ్ల‌తో కూడుకున్న‌ది.. 24 గంట‌ల విధుల‌తో, క‌త్తి మీద సాము చేస్తున్న ఖాకీలను ఓ మ‌హ్మ‌మారి వెంటాడుతోంది. అదే గుండెపోటు. ఆ గుండెపోటు బారిన ప‌డి ఖాకీలు ప్రాణాలు వ‌దులుతున్నారు…

యుక్తవయసులో ఉన్నవారు, ఆరోగ్యంగా కనిపిస్తున్న వారు సైతం ఆకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోతున్న ఉదంతాలు ఇటీవలి కాలంలో తరచూ కనిపిస్తున్నాయి. ఆరోగ్యంగా ఉన్నవారు, ఆడుతూ పాడుతున్న వారు అనూహ్యంగా మృత్యువాత పడుతున్న ఘటనలు చాలా జరిగాయి. సెలబ్రిటీలు మొదలుకుని రాజకీయ నాయకుల వరకు పూర్తి ఫిట్నెస్‌తో ఉన్న వారు కూడా ఇలా అనూహ్యంగా గుండెపోటు మరణాలకు గురైన ఉదంతాలు పెద్ద సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. ప్రాణం ఎప్పుడు ఎలా పోతుందో ఎవరు చెప్పలేరు. కోవిడ్‌ తర్వాత కాలంలో అనూహ్య మరణాలు చాలా వెలుగులోకి వ‌స్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా గుండెపోటు మ‌ర‌ణాలు పెరుగుతున్నాయి. ఈ గుండెపోటు మ‌హ‌మ్మారి వ‌రుస‌గా ఖాకీల‌ను పొట్ట‌న‌బెట్టుకుంటోంది. ఈ మ‌ధ్య కాలంలో పెద్దఎత్తున పోలీసులు గుండెపోటుతో మ‌ర‌ణిస్తున్నారు. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలోనే ఈ ఏడాది కాలంలో ఎనిమిది మంది వ‌ర‌కు చ‌నిపోయారంటే ప‌రిస్థితి అర్ధం చేసుకోవ‌చ్చు. విధులు నిర్వ‌హిస్తూనే అలాగే కుప్ప‌కూలుతున్న‌వారు, ఇంట్లో ప‌నులు చేసుకుంటునో, నిద్రిస్తూనే ప్రాణాలు విడుస్తున్నారు. పోలీసుల వ‌రుస మ‌ర‌ణాల‌తో ఆందోళ‌న నెల‌కొంది.

అనారోగ్య‌మా..? ప‌ని ఒత్తిడా..?
దాదాపు అన్ని చోట్ల ఇలాంటి గుండెపోట్లు సంభ‌విస్తున్నా.. పోలీసు శాఖ‌లో వ‌రుస మ‌ర‌ణాల జ‌ర‌గ‌డం అనారోగ్య కార‌ణాలా..? లేక ప‌ని ఒత్తిడి వ‌ల్ల ఇలా సంభ‌విస్తున్నాయా…? అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్నం అవుతున్నాయి. వాస్త‌వానికి మిగ‌తా డిపార్ట్‌మెంట్ల‌తో పోల్చితే పోలీసులు ఖ‌చ్చితంగా ఫిట్‌నెస్‌గా ఉంటారు. ఉండాలి కూడా. గ‌త ఏడాది మంచిర్యాల జిల్లాలో మ‌ర‌ణించిన కానిస్టేబుల్ పంజాల స‌తీష్ ఎప్పుడూ వాకింగ్ చేస్తూ, ష‌టిల్ ఆడుతూ, స్విమింగ్ ఫూల్‌లో గ‌డిపేవాడు. కానీ అదే స్విమింగ్‌ఫూల్‌లో గుండెపోటు రావడంతో మృత్యువాత ప‌డ‌టం విషాదం. అయితే, కొన్ని సంద‌ర్భాల్లో వారికి ప‌ని ఒత్తిడి ఉంటోంద‌ని ఈ నేప‌థ్యంలోనే ఇబ్బందులు త‌ప్ప‌డం లేద‌ని ప‌లువురు చెబుతున్నారు.

హెల్త్ చెక‌ప్‌లు లేక ఇబ్బందులు
పోలీసుల విధి నిర్వ‌హ‌ణ‌లో ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయి. వాట‌న్నింటిని అధిగ‌మించి ప‌ని చేస్తుంటారు. ఈ నేప‌థ్యంలో వారికి ఎప్ప‌టిక‌ప్పుడు ఆరోగ్య ప‌రీక్ష‌లు ఉంటే బాగుంటుంది. కానీ, కొద్ది రోజులుగా వారికి స‌రైన ఆరోగ్య ప‌రీక్ష‌లు చేయ‌డం లేదు. గ‌తంలో ఆరోగ్య ప‌రీక్ష‌ల కోసం రూ. 3 వేలు ఇచ్చేవారు. కానీ, గ‌త ఏడాది నుంచి కేవ‌లం వెయ్యి రూపాయ‌లు మాత్ర‌మే ఇస్తున్నారు. దీంతో ఈ డ‌బ్బులు స‌రిపోవ‌డం లేదని పోలీసులు వాపోతున్నారు. అధికారులు ఇప్ప‌టికైనా క‌లుగ‌చేసుకుని పోలీసుల‌కు నిత్యం వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించేలా చూడాల‌ని కోరుతున్నారు. లేక‌పోతే పోలీస్‌స్టేష‌న్ల వారీగా ఆరోగ్య‌ప‌రీక్ష‌లను నిర్వ‌హించేలా చ‌ర్య‌లు తీసుకునేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

-ఈ ఏడాది మే 5న మంచిర్యాలలో ఈత కొడుతూ గుండెపోటుతో పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందాడు.
మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ పంజాల సతీష్ (40) ఉదయం 7 గంటల సమయంలో సీసీసీలో స్విమ్మింగ్ పూల్ వద్ద ఈత కొడుతూ కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సతీష్ 2008లో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరాడు. మంచిర్యాలలో పోస్టింగ్‌కు ముందు వివిధ పోలీస్ స్టేషన్‌లలో పనిచేశాడు.

-అక్టోబ‌ర్ 1న ఆదిలాబాద్​ జిల్లా జైనథ్ మండలం బెల్గాంకు చెందిన హెడ్​ కానిస్టేబుల్​ గంగన్న(58) తాంసి పోలీస్ స్టేషన్ లో డ్యూటీ చేస్తూ గుండెపోటుతో చనిపోయాడు. ఆదిలాబాద్ పట్టణంలోని టైలర్స్ కాలనీలో నివాస ఉండే గంగన్న రోజులాగే డ్యూటీకి వెళ్లాడు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే 108కు సమాచారం అందించడంతో అక్కడి చేరుకున్న సిబ్బంది అతడిని పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. అదే స్టేషన్​లో రైటర్​గా పని చేస్తున్న కొడుకు చిరంజీవి కండ్ల ముందే గంగన్న ప్రాణాలు మ‌రో విషాదం.

-అక్టోబ‌ర్ 14న కాగజ్ నగర్ రూరల్ ఎఎస్సై గులాబ్ మక్సుద్ అహ్మద్ సైతం అదే మ‌హ్మ‌మారి బారిన ప‌డ్డారు. 1990 బ్యాచ్ కు చెందిన ఆయ‌న కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఎ.ఎస్.ఐగా విధులు నిర్వహించేవారు. ఆయ‌న‌కు గుండెపోటు రావ‌డంతో ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా మృత్యువాత ప‌డ్డారు.

-నవంబ‌ర్ 4న సిర్పూర్ (యు)కి చెందిన కానిస్టేబుల్ మడావి ఆనంద్ కుమార్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వ‌హించేవాడు. 2012 బ్యాచ్ కు చెందిన ఆయ‌న బ్లూకోల్ట్ విభాగంలో విధులు నిర్వ‌హించేవారు. ఆయ‌న‌కు సైతం గుండెపోటు రావ‌డంతో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అప్ప‌టికే ఆయ‌న మృత్యువాత ప‌డ్డారు.

-తాజాగా సోమ‌వారం కాగజ్‌నగర్‌లో సోమవారం హెడ్ కానిస్టేబుల్ తిరుపతయ్య(51) గుండెపోటుతో మృత్యువాత ప‌డ్డారు. తిరుపతయ్య ఛాతీ నొప్పితో బాధపడుతూ ఉదయం 6 గంటలకు అపస్మారక స్థితిలో పడిపోయాడు. వెంటనే పట్టణంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన తిరుపతయ్య 1993లో పోలీసు శాఖలో చేరారు.

-గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ 12న హెడ్ కానిస్టేబుల్ కుద్మెట జ‌ల్‌ప‌థ్ రావు(53) చ‌నిపోయారు. సిర్పూర్ (యూ) మండ‌లానికి చెందిన ఆయ‌న‌ 1990లో పోలీసు డిపార్ట్‌మెంట్‌లో చేరారు. కానిస్టేబుల్‌గా త‌న కెరీర్‌ను ప్రారంభించి, హెడ్ కానిస్టేబుల్ దాకా ఎదిగారు. రాత్రి త‌న‌కు ఛాతీలో నొప్పి వ‌స్తుంద‌ని కుటుంబ స‌భ్యులకు తెలిపాడు. దీంతో అత‌న్ని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా, అప్ప‌టికే మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటు వ‌ల్లే కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడ‌ని తెలిపారు.

-గ‌త ఏడాది డిసెంబ‌ర్ 23న గుండెపోటుతో హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి చెందారు. ఈ ఘటన ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో చోటు చేసుకున్నది. కాగజ్‌నగర్‌ మండలంలోని ఈస్‌గాం పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న దయానంద్‌ (55) బ్లూకోట్ విధుల్లో భాగంగా నజ్రుల్‌నగర్‌ మార్కెట్‌కు వెళ్లగా రాత్రి అక్కడే గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయాడు. తోటి పోలీసులు తమ వాహనంలో అతడిని తీసుకుని కాగజ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స ప్రారంభించే లోపే ఆయన తుదిశ్వాస విడిచారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like