అన్నలా.. కుటుంబ పెద్ద‌లా అండ‌గా ఉంటాం

రామ‌గుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్

Ramagundam Police Commissionerate: ప్రజల సమస్యలు, అవసరాలు తీర్చేందుకు ఒక అన్నలా, కుటుంబ పెద్దలా పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటార‌ని రామ‌గుండం పోలీస్ కమిష‌న‌ర్‌ ఎం.శ్రీనివాస్ అన్నారు. నీల్వాయి పోలీసుల ఆధ్వర్యంలో దస్నాపూర్ క్రాస్ రోడ్ ఆశ్రమ పాఠశాలలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హజరైన క‌మిష‌న‌ర్ శ్రీ‌నివాస్ వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోస‌మే పోలీస్ శాఖ నిరంతరం శ్రమిస్తుందన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి వైద్యం అందించేందుకు ఈ వైద్య శిబిరాలను ఏర్పాటు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. ఆదివాసి గ్రామస్తులకు, మహిళలకు పోలీసులపై ఉన్న సదాభిప్రాయాన్ని, ప్రభుత్వం పట్ల ఉన్న నమ్మకాన్ని మరింత పెంపొందేలా ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామన్నారు. అభివృద్ధికి దూరంగా బ‌తుకుతున్న ఆదివాసీలను అభివృద్ధి మార్గం వైపు పయనించేలా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

చదువు, క్రీడల్లో ప్రతిభ కలిగిన యువకులను ప్రోత్సహించడానికి, పోలీస్ శాఖ అలాగే ప్రభుత్వం తోడుగా ఉంటుందన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే మావోయిస్టులకు సహాయ సహకారాలు అందించకూడదన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా పోలీసు అధికారులకు, మీ వద్దకు వచ్చిన అధికారులకు చెప్పి వాటిని ప‌రిష్క‌రించుకోవాల‌న్నారు. గ్రామాల్లోని యువత బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో చేరి, ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని, మంచి పేరు తీసుకురావాలని కోరారు. అనంతరం ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వృద్దులకు దుప్పట్లను, యువతకు వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు.

ఈ వైద్య శిబిరానికి వేమనప‌ల్లి మండలం కల్లంపల్లి, రాజారాం, సంపుటం, దస్నాపూర్, గొర్లపల్లి, కొత్తకాలనీ, జిల్లెడ, జక్కేపల్లి, బుయ్యారం, రాచర్ల, ముల్కల్పేట్, ముక్కిడిగూడెం, సీతారా, చామనపల్లి, బద్దంపల్లి, బమ్మెనా, ఒడ్డుగూడెం, నాగారం, కేతన్పల్లి, కల్మల్పేట గ్రామాల నుండి సుమారు 800 మంది ఈ వైద్య శిబిరానికి హాజరయ్యారు. అన్ని విభాగాలలో నిపుణులైన వైద్యుల బృందం సహాయంతో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. వైద్య సేవలు అందించడానికి వచ్చిన డాక్టర్ల బృందానికి సీపీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్య‌క్ర‌మంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూరు రూరల్ సిఐ సుధాకర్, చెన్నూర్ టౌన్ ఇన్స్పెక్టర్ రవీందర్, నీల్వాయి ఎస్ఐ శ్యామ్ పటేల్, కోటపల్లి ఎస్ఐ రాజేందర్, జైపూర్ ఎస్ఐ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like