మంచిర్యాలలో వాహనదారులపైకి దూసుకువెళ్లిన బస్సు
Road accident in Manchirayl: మంచిర్యాల జిల్లాలో ఉదయం ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. వాహన దారులపైకి దూసుకెళ్లడంతో జనం భయంతో పరుగులు తీశారు. వివరాల్లోకి వెళితే.. ఈ రోజు (శుక్రవారం) ఉదయం మంచిర్యాల జిల్లా కేంద్రం నుండి కరీంనగర్ కు వెళ్తున్న గోదావరిఖనికి చెందిన ఆర్టీసీ బస్సు వెంకటేశ్వర టాకీస్ సమీపంలో వాహనదారుల పైకి దూసుకెళ్లింది. మొదట స్కూటీ పైన ఉన్న వ్యక్తిని ఢీ కొట్టిన బస్సు రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న వాహనాల పైకి దూసుకెళ్లడంతో పలు వాహనాలు దెబ్బతిన్నాయి. స్కూటీ పై ఉన్న వాహనదారునికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.
రెండు కార్లు, మూడు బైక్ లు దెబ్బతిన్నాయి. బస్సు డ్రైవర్ అస్వస్థతకు గురి కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. డ్రైవర్ ఎల్లయ్యకు ఫిట్స్ రావడంతో బస్సు అదుపు తప్పినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. డ్రైవర్ ఒక్కసారిగా స్టీరింగ్ మీదకు ఒరగడంతో వాహనాలపైకి దూసుకువెళ్లింది. చివరకు డ్రైవరే తేరుకుని బస్సును పక్కకు ఆపేశారు. మంచిర్యాల హాస్పిటల్ లో ఎల్లయ్యకు వైద్యం అందిస్తున్నారు.