ఎస్సై సాయికుమార్ మృత‌దేహం ల‌భ్యం

Body of SI Saikumar found : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో పనిచేస్తున్న ఎస్సై సాయికుమార్ మృత‌దేహం గురువారం ఉద‌యం ల‌భించింది. ఆయ‌న‌తో పాటు బీబీపేటలో కానిస్టేబుల్ శ్రుతితోపాటు బీబీపేట మండలానికి చెందిన కంప్యూటర్ ఆపరేటర్‌ నిఖిల్ చెరువులో శ‌వాలై తేలిన ఘ‌ట‌న క‌ల‌క‌లం సృష్టించింది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు సమీపంలో కానిస్టేబుల్ శ్రుతి, నిఖిల్ ఫోన్లతోపాటు ఎస్సై కారు లభ్యం కావడం, చెరువు వద్ద చెప్పులు ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు అధికారులు అనుమానించారు. దీంతో బుధవారం రాత్రి గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది చెరువులో మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

బుధవారం అర్ధరాత్రి సమయంలో కానిస్టేబుల్ శ్రుతి, యువకుడు నిఖిల్ మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతైన ఎస్సై సాయికుమార్‌ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఇవాళ ఉదయం అతని మృతదేహం లభ్యమైంది. బుధవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి భిక్కనూరు ఎస్సై సాయికుమార్‌ ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ రావడంతో పోలీసులు ఆయన కోసం ఆరా తీయడం ప్రారంభించారు. బీబీపేట ఠాణాలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ శ్రుతి కూడా బుధవారం ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నట్లు స్టేషన్​లో చెప్పి బయటికి వచ్చారు. మధ్యాహ్నమైనా తమ కుమార్తె ఇంటికి రాకపోవడంతో కానిస్టేబుల్‌ శ్రుతి తల్లిదండ్రులు బీబీపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసు స్టేషన్​ నుంచి ఎప్పుడో వెళ్లిపోయినట్లు పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఆందోళనకు గురైన శ్రుతి తల్లిదండ్రులు వెంటనే అధికారులను సంప్రదించారు. ఆమె ఫోన్​ సిగ్నల్‌ ఆధారంగా సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్లు పోలీసులు గుర్తించగా.. హూటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో చెరువు వద్ద కానిస్టేబుల్‌ శ్రుతి, బీబీపేటకు చెందిన నిఖిల్‌ మొబైల్​ ఫోన్లు దొరకగా భిక్కనూరు ఎస్సై సాయికుమార్‌కు చెందిన కారు, పాదరక్షలు కనిపించాయి. దీంతో గాలింపు చర్యలు చేపట్టగా మహిళ కానిస్టేబుల్‌ శ్రుతి, నిఖిల్‌ మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎస్సై సాయికుమార్‌ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఇవాళ ఉదయం ఆయన మృతదేహం లభ్యమైంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like