ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు

MLA Kaushik Reddy arrested: హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. జూబ్లీహిల్స్ లో కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డిని కరీంనగర్ తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదివారం కరీంనగర్‌ కలెక్టరేట్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో కౌశిక్‌ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ పాల్గొన్నారు. ఆ క్రమంలో సంజయ్‌ను ఉద్దేశించి కౌశిక్‌రెడ్డి చేసిన కామెంట్ల కారణంగా వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్తా స్వల్ప ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సమక్షంలో జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌కు ఎమ్మెల్యే సంజయ్‌ ఫిర్యాదు చేశారు. తనపై కౌశిక్‌రెడ్డి దుర్భాషలాడారని ఆ ఫిర్యాదులో సంజయ్‌ స్పష్టం చేశారు. తాను ప్రజా సమస్యలపై మాట్లాడుతున్న సమయంలో కౌశిక్‌ రెడ్డి.. తనను అడ్డుకున్నారని చెప్పారు. దీంతో కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను ఎమ్మెల్యే సంజయ్ కోరారు. తనను బూతులు తిట్టి, చేయి చేసుకున్నాడంటూ సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పీకర్ కు సైతం సంజయ్ సోమవారం ఫిర్యాదు చేశారు.

ర‌సాభాస‌గా స‌మీక్షా స‌మావేశం
కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మంత్రుల సమీక్ష సమావేశం రసాభాసగా మారింది. మంత్రుల సమక్షంలోనే ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ కొట్టుకున్నంత పని చేశారు. కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఇతర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. అయితే, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. నువ్వు ఏ పార్టీ తరఫున గెలిచావు? ఆ తర్వాత ఏ పార్టీలోకి వెళ్లావు?… అసలు నీ పార్టీ ఏది? అంటూ కౌశిక్ రెడ్డి… సంజయ్ పై మండిపడ్డారు. దాంతో, ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇరువురు నేతలు పరుష పదజాలంతో తిట్లు అందుకున్నారు. ఒకరినొకరు నెట్టుకునే వరకు వెళ్లింది. దాంతో అక్కడున్న నేతలు కౌశిక్ రెడ్డిని నిలువరించారు. ఈ దశలో పోలీసులు రంగప్రవేశం చేసి కౌశిక్ రెడ్డిని సమీక్ష సమావేశం నుంచి బయటికి తీసుకుని వెళ్లారు.

రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా..?
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే సంజయ్‌పై దాడి చేసిన కౌశిక్ రెడ్డిపై పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేయనున్నట్లు సోష‌ల్ మీడియాలో విస్తృతంగా ప్ర‌చారం సాగుతోంది. ఇప్పటికే కౌశిక్‌ రెడ్డిపై మూడు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ ఆర్డివో ఇచ్చిన ఫిర్యాదుతో పాటు, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పీఏ కంప్లైట్ ఇచ్చారు. దీంతో పాడి కౌశిక్‌ రెడ్డిపై బీఎన్ఎస్ యాక్టు 132, 115 (2), 352,292 కేసులు ఫైట్ చేశారు. మరో ఫిర్యాదుపై కూడా 126 (2),115(2) సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదయ్యాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like