అవినీతి కాదు… అభివృద్ది చేస్తున్నాం
-మంచిర్యాల నంబర్ వన్‌గా నిలపాలన్నది మా ధ్యేయం
-ప్రేంసాగర్ రావు ప్రజల కోసం, అభివృద్ది కోసం తపిస్తున్నాడు
-గోదావరిని బొందల గడ్డలా మార్చిన చరిత్ర దివాకర్ రావుది
-ఆయన తన రెండు కండ్లు తెరుచుకుని చూడాలి
-దక్షిణ భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా మహాప్రస్థానం
-ప్రజలు ఛీ కొట్టినా మాజీ ఎమ్మెల్యేకు బుద్ది రాలేదు
-శ్మశాన వాటిక పేరుతో ఆయన డబ్బులు వసూలు చేశారు
-విలేకరుల సమావేశంలో మంచిర్యాల కాంగ్రెస్ నేతలు
మంచిర్యాలను తెలంగాణ రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా నిలిపేందుకు ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు కృషి చేస్తున్నారని దానిని చూసి ఓర్వలేకనే మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నాడని మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి మాట్లాడుతూ గతంలో ఎంతో మంది నాయకులు చేయలేని అభివృద్ధి పనులు ఇప్పుడు చేస్తున్నారన్నారు. ఇన్నేండ్లుగా మంచిర్యాలకు కనీసం శ్మశాన వాటిక లేకపోవడం సిగ్గుచేటన్నారు. దీంతో చాలా మంది ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఈ బాధలు అర్దం చేసుకున్న ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు దక్షిణభారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా నాలుగు ఎకరాల్లో రూ. 11 కోట్లతో శ్మశాన వాటిక నిర్మిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా, పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారని అన్నారు. ఈ అభివృద్ది చూసి ఓర్చుకోలేక ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేయడం ఏ మేరకు సమంజసమని దుయ్యబట్టారు.
గోదావరిలో మట్టి దోచుకుపోతున్నారని ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. గోదావరిలో తీసుకువచ్చిన మట్టి శ్మశాన వాటిక పనులకు ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఆ మట్టికి ఎంబీ రికార్డు చేయమని ఎమ్మెల్యే చెప్పిన విషయాన్ని వారు గుర్తు చేశారు. ఎమ్మెల్యేకు పేరు వస్తుందని ఓర్చుకోలేక పోతున్నారని దుయ్యబట్టారు. ఇసుక ఎక్కడకు వెళ్తోందని ప్రశ్నిస్తున్నారని దానికి రాయల్టీ కూడా కట్టామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేకు డబ్బుల గురించి కొదవ ఏం లేదన్నారు. ఆయన వ్యాపారాల్లో కోట్టు సంపాదించుకున్నారని అన్నారు. ప్రజలు ఛీ కొట్టినా ఆయనకు బుద్ది రాలేదన్నారు. గత ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితం అయ్యారన్నారు. నువ్వు తలబద్దలు కొట్టుకున్నా ప్రజలు నీ మాట నమ్మరని దివాకర్ రావుకు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తూముల నరేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ప్రేంసాగర్ రావు అభివృద్ధి కోసం ముందుకు సాగుతున్నాడన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్నారని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు కాళ్లలో కట్టె అడ్డం పెట్టినట్టు ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ఒక్క ఆసుపత్రి కట్టించావా…? ఒక్క మంచి స్కూల్ కట్టించావా..? కనీసం మంచిర్యాల శ్మశానవాటిక కూడా కట్టించలేని దౌర్భగ్యపాలన నిదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రేంసాగర్ రావు ఇంట్లో నిత్యం భోజనాలు పెడుతున్నారని, మీరు ఆరోపించిన డబ్బులు ఆ భోజనాలకు సంబంధించి విస్తరాల విలువ కాదన్నారు. ముల్కల్లలో ఇండస్ట్రీయల్ పార్క్ అవుతుంటే అక్కడ కొందరు తొత్తులను రెచ్చగొట్టి ఆపాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. చిల్లర రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదు. అభివృద్ధి పనులకు అడ్డుపడితే ప్రజలంతా కలిసి నీ ఇంటి మీదకు దాడి చేసే రోజు వస్తుందని అన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి సూచనలు ఇస్తే స్వీకరిస్తామని అన్నారు.
మహిళా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అర్కాల హేమలత మాట్లాడుతూ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా చనిపోయిన మనిషికి దహనసంస్కారాలు చేసేందుకు కూడా శ్మశాన వాటిక నిర్మించలేదని దుయ్యబట్టారు. సిగ్గుపడాల్సి పోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని దుయ్యబట్టారు. మీకు కొబ్బరికాయల దివాకర్ రావు అని పేరుందని కొబ్బరి కాయలు కొట్టడం తప్ప ఎక్కడా సరైన పనులు చేయించలేదని ఎద్దేవా చేశారు. మంచిర్యాల నంబర్ వన్‌గా నిలపాలని ప్రేంసాగర్ రావు తపన పడుతున్నారని గుర్తు చేశారు. నీ హయాంలోనే పూర్తిగా గోదావరి బొందల గడ్డగా మారిందని దివాకర్ రావుపై దుయ్యబట్టారు. నిమిషానికి మూడు నుంచి నాలుగు ట్రాక్టర్ల ఇసుక వెళ్లేదని జనం ఇబ్బందులు పడ్డా కనీసం పట్టించుకోలేదన్నారు. శ్మశాన వాటిక పేరుతో డబ్బులు వసూలు చేసుకుని దగ్గర పెట్టుకున్నారని ప్రేంసాగర్ రావు హెచ్చరించిన తర్వాత డబ్బులు వాపస్ ఇచ్చిన విషయం వాస్తవమా..? కాదా..? అన్నారు. నిన్ను మంచిర్యాల నుంచి వెళ్లగొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు.