అందుకే కొట్టా

‘నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు ఎవరిపై చెయ్యి కూడా ఎత్తలేదు. కానీ..ఈరోజు జరుగుతున్న అన్యాయం చూసి న్యాయం కోసం చేయి చేయికోవాల్సి వచ్చిందసని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్ మీద చేయి చేసుకోవటంపై ఆయన స్పష్టత ఇచ్చారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీలో 149 ఎకరాల్లో ఏకశిలా నగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉందని 1985లో వివిధ సంస్థలలో పనిచేసే చిన్న ఉద్యోగులు ఈ భూములు కొనుక్కున్నారని ఈటల చెప్పారు. 2006లో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి మోసం చేసేందుకు చూశారని, రియల్ ఎస్టేట్ డాక్యుమెంట్స్ తప్పని కోర్టు డిస్మిస్ చేసిందని ఎంపీ ఈటల పేర్కొన్నారు.
రియల్ ఎస్టేట్ బ్రోకర్ స్థానిక నాయకులను పట్టుకొని వందమంది గుండాలను, 10 కుక్కలను పెట్టి మరి ఈ ఏకశిలా నగర్ వాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఆడవాళ్లను ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. పోచారం పోలీస్ స్టేషన్ ఎస్ఐ, సీఐ వాళ్లకే సపోర్ట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రిపూట వాళ్ల గుండాలు ఎంపీ వచ్చి ఏం పీకుతాడు అని చెప్పి మహిళలను బెదిరించారు.’ అంటూ ఈటల వివరణ ఇచ్చారు. `పొద్దున్నే బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నాను. అందులో ఒక చిరు ఉద్యోగి.. 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాను ఈ గుండాలు కూలగొట్టారని నా ఇల్లు చూడమని కోరితే.. అటు వెళ్ళాను. 20 మంది గుండాలు బీరు సీసాలు పెట్టి తాగుతూ ఏం చేస్తారు అన్నట్టు చూస్తున్నారు. రెండు నెలలుగా మా మీద దుర్మార్గాలు చేస్తున్నారు వీరే అని చూపించగానే.. వారి దగ్గరికి వెళ్ళాను. పోలీసు ధర్మాన్ని కాపాడటంలో విఫలమైనప్పుడు రెవెన్యూ అధికారులు విఫలమైనప్పుడు ప్రజల ఓట్లతో గెలిచిన బిడ్డగా ధర్మాన్ని కాపాడటానికి వాళ్లకు అండగా ఉండడానికి వానికి పనిష్మెంట్ ఇచ్చాను. నేను దీనిని తప్పుగా భావించడం లేదు. ` అంటూ ఈటల వివరణ ఇచ్చారు.
పోలీసులు, రెవెన్యూ అధికారులు న్యాయం చేయకపోవడంతో.. ప్రజాప్రతినిధిగా బాధితులకు న్యాయం చేసేందుకు తాను పోరాటం చేస్తానని ఈటల భరోసా ఇచ్చారు. వారిపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని కూడా తెలిపారు. రాచకొండ పోలీస్ కమిషనర్‌కి సైతం జరిగిన విషయం వివరిస్తానని ఈటల రాజేందర్ తెలిపారు. కోర్టుల్లో న్యాయం దక్కినా కూడా స్థానికంగా వీరికి న్యాయం జరగడం లేదని ఈటల వాపోయారు. వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించి.. బాధితులకు న్యాయం చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.