సింగరేణి అధికారుల హక్కులు కాలరాస్తున్న కాంగ్రెస్

-పీఆర్పీ వెంటనే అమలు చేయాలి
-సింగరేణి అధికారుల న్యాయపోరాటానికి అండగా ఉంటాం
-బీఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావ్

సింగరేణి అధికారుల డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్రరావు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన సింగరేణి కోల్ మైన్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అధికారుల న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న పీఆర్పీ బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సింగరేణి చరిత్రలో కార్మికులు సమ్మెలు చేయడం సాధారణమే అయినా, ఇప్పుడు అధికారులు కూడా తమ హక్కుల కోసం రిలే నిరాహార దీక్షలు, ర్యాలీలు చేపట్టాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఏడాది అధికారులకు పనితీరు ఆధారిత ప్రోత్సాహకంగా పీఆర్పి చెల్లించామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లుగా పీఆర్పీ నిలిపివేసి అధికారుల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. దీనివల్ల అధికారుల్లో నిరుత్సాహం పెరిగి బొగ్గు ఉత్పత్తి కూడా తగ్గిపోయిందని పేర్కొన్నారు.

బొగ్గు ఉత్పత్తి తగ్గడంతో రాష్ట్రంలోని కేటీపీఎస్, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కొన్ని యూనిట్లు మూతపడే పరిస్థితి ఏర్పడిందని, దీంతో తెలంగాణ డిస్కంలు బయట నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తోందని విమర్శించారు.దాదాపు 2,500 మంది అధికారులు నల్ల కండువాలు ధరి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. కోల్ ఇండియాలో ఇప్పటి అమలవుతున్న పే అప్గ్రేడేషన్ విధానాన్ని సింగరేణిలో కూడా ఎలాంటి జాప్యం లేకుండా అమలు చేయాలని కోరారు. I

బదిలీలు, ప్రమోషన్లలో గతంలో అమలైన పారదర్శక కౌన్సెలింగ్ విధానాన్ని పునరుద్దరించాలని, ప్రస్తుతం రాజకీయ జోక్యంతో అవినీతికి అవకాశం కలుగుతోందని ఆరోపించారు. సింగరేణి సీఎండీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తక్షణమే అధికారుల సంఘాన్ని చర్చలకు ఆహ్వానించి, పీఆర్పీ బకాయి౦ విడుదల చేసి సమ్మెను విరమించేలా చూడాలని డిమాండ్ చేశారు. అధికారులు అధైర్యపడవద్దని, వారి న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం వద్ద బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ప్రస్తావిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొప్పుల ఈశ్వర్, అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like