మ‌గాళ్ల‌ను చంప‌డం ఎలా..?

-మెట్రోలో పుస్తకం చదివిన యువతి
-సోషల్ మీడియాలో వైరల్

మెట్రో రైలులో ప్రయాణిస్తున్న ఓ యువతి పుస్త‌కం చదువుతోంది… అది కాస్తా వైర‌ల్ అయ్యింది… అదేంటి రైలులో కొంద‌రు సెల్‌ఫోన్లు, కొంద‌రు పుస్త‌కాలు చ‌దువుతారు.. దాంట్లో వైర‌ల్ అవ్వాల్సినంత‌గా ఏముంది అనుకుంటున్నారా..? అసలు విష‌యం ఇదీ.. ఆ అమ్మాయి చ‌దువుతున్న పుస్త‌కం పేరు.. “How to K!ll Men and Get Away With It” (మ‌గాళ్ల‌ను చంప‌డం ఎలా..?) అనే శీర్షిక ఉన్న పుస్తకాన్ని చదువుతుండగా ఎదురుగా ఉన్న ప్ర‌యాణీకులు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పుస్తకం పేరు చూసిన ప్రయాణికులు, నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.

భ‌ర్త‌ల‌ను, ప్రియుల‌ను వ‌రుస పెట్టి చంపుతున్న ఘ‌ట‌న‌లు దేశంలో ఎక్క‌డో ఓ చోట వినిపిస్తునే ఉంది. ఇలాంటి వార్తలు ఇంకా ప్రజల మదిలో తాజాగా ఉండటంతో, ఈ వీడియో మరింత ఆసక్తిని రేకెత్తించింది. ప్రశాంతంగా ప్రయాణిస్తూ పుస్తకం చదువుతున్న యువతి, మరోవైపు హత్య గురించి ఉన్నట్లు కనిపించే సంచలనాత్మక శీర్షిక.. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసమే వీడియో వైరల్ కావడానికి ప్రధాన కారణమైంది. దీంతో సోషల్ మీడియాలో అనేక మంది సరదాగా స్పందించారు. కొందరు “పక్కనే కూర్చున్న వాళ్ల పరిస్థితి ఏంటి?” అంటూ హాస్యభరిత వ్యాఖ్యలు చేయగా, మరికొందరు “పుస్తకాన్ని దాని ముఖచిత్రం లేదా శీర్షిక చూసి మాత్రమే అంచనా వేయకూడదు” అని వ్యాఖ్యానించారు.

ఈ వీడియోకి ఏకంగా 19 మిలియ‌న్ల వ్యూస్‌, 4 ల‌క్ష‌ల లైక్‌లు వ‌చ్చాయంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. అయితే, ఈ పుస్తకం హింసను ప్రోత్సహించేలా ఉండ‌దు. ఇది బ్రిటిష్ రచయిత్రి కేటీ బ్రెంట్ రాసిన డార్క్ కామెడీ, సైకాలజికల్ థ్రిల్లర్ తరహా కల్పిత నవల. మహిళల భద్రత, లింగ వివక్ష, సామాజిక సమస్యలు వంటి అంశాలను వ్యంగ్యాత్మకంగా ప్రస్తావించే సాహిత్య రచన మాత్ర‌మే. సాధారణంగా పుస్తకం చదువుతున్న దృశ్యమే అయినా, సంచలనాత్మక శీర్షిక, ప్రస్తుత పరిస్థితులు కలిసి దానిని సోషల్ మీడియాలో వైరల్ క్షణంగా మార్చేశాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like